విజయవాడ నగరాన్ని బుడమేరు వాగు ముంచెత్తుతోందని తెలిసినా ముంపు నుంచి ప్రజలను ఎలాగూ కాపాడలేకపోయారని, వరద పోటెత్తిన తర్వాత బాధితులను ఆదుకోవడంలోనూ ప్రభుత్వం మానవత్వంతో వ్యవహరించడం లేదని వైసీపీ నాయకులు మండిపడ్డారు. తుపాన్ వస్తుందని, కుండపోత వానలు పడతాయని తెలిసి కూడా, ఫ్లడ్ మేనేజ్‌మెంట్ చేయలేదన్న వారు, అసలు ప్రభుత్వం ఎందుకు జాగ్రత్త పడలేదని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి బాధ్యత తీసుకుంటుందన్న వారు.. ఎవరిని బాధ్యులను చేస్తారని నిలదీశారు. ఇంత జరిగినా దీనిపై సీఎం చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని సూటిగా ప్రశ్నించారు. విజయవాడ వరద బాధితులకు ప్రభుత్వం ప్రకటించిన సాయం, ఏ మాత్రం సరిపోదన్న వారు, వెంటనే వాటన్నింటినీ పెంచాలని డిమాండ్ చేశారు. 9 అడుగుల వరకు వరద ముంచెత్తిన దారుణ పరిస్థితి కనిపించినా, 60 మందికి పైగా అమాయకులు చనిపోయినా కంటి తుడుపుగా వరద సాయం ప్రకటించడం దారుణమన్నారు.