పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ విషయంలో ప్రభుత్వం పీహెచ్‌సీ డాక్టర్ల డిమాండ్‌పై సానుకూలంగా స్పందించింది. ప్రభుత్వం, పీహెచ్‌సీ వైద్యుల సంఘం ప్రతినిధుల మధ్య బుధవారం సచివాలయంలో దాదాపు రెండు గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్ స్వయంగా పాల్గొన్నారు. తొలుత పీహెచ్‌సీ వైద్యులు... ‘జీవో 85ను వెంటనే ఉపసంహరించాలి. టైం బౌండ్ పదోన్నతులు, ఇంక్రిమెంట్లు విషయంలో తమకు న్యాయం చేయాలి. బోధనాసుపత్రుల్లో పనిచేస్తున్న ఎంబీబీఎస్ డాక్టర్లకు అందిస్తున్న ఆర్థిక వెసులుబాటును పీహెచ్‌సీ డాక్టర్లకూ వర్తింపజేయాలి’ అని డిమాండ్ చేశారు. వైద్యుల డిమాండ్లపై మంత్రి సానుకూలంగా స్పందించారు. ‘పీహెచ్‌సీ వైద్యులు పీజీ పూర్తి చేసుకుని 2027లో సరీసులోకి చేరే సమయానికి వివిధ స్పెషలిస్టు డాక్టర్ల ఖాళీల లభ్యతను దృష్టిలో పెట్టుకుంటా. ఆమేరకు ఈ సంవత్సరం పీజీ కోర్సుల్లో ప్రవేశాలు ఆశిస్తున్న వైద్యులు సంఖ్యను పరిగణలోకి తీసుకుంటాం. వారికి వీలైనంత మేరకు న్యాయం చేయడానికి చిత్తశుద్ధితో కృషి చేస్తాం. ఇందుకోసం జీవో 85లో సవరణలు చేస్తాం. 2024 నాటికి ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల ఖాళీల లభ్యత, ఈ ఏడాది పీజీ పరీక్షల్లో అర్హత పొందిన పీహెచ్‌సీ వైద్యుల సంఖ్య మధ్య భారీ వ్యత్యాసం ఉంది. అయినా వైద్యుల ఆశల్ని నేరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఈ దిశగా మరోసారి పీహెచ్‌సీ వైద్యులతో చర్చిస్తాం. హెల్త్ వర్సిటీ సీట్ మ్యాట్రిక్స్ ప్రకటించేలోగా తుది నిర్ణయాన్ని తీసుకుంటాం. సమస్యలు పరిష్కారం కావాలంటే పట్టువిడుపు ధోరణితో వ్యవహరించాలి. ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టు వైద్యుల పోస్టుల లభ్యత, నియామకాలపై ప్రభుత్వానికి ఉన్న పరిమితుల్ని వైద్యులు అర్థం చేసుకోవాలి’ అని మంత్రి విజ్ఞప్తి చేశారు. జీవో 85లో ప్రస్తావించిన ఆరు పీజీ కోర్సుల్లోనే కాకుండా అన్ని కోర్సుల్లో ప్రవేశాలు కల్పించాలన్న వైద్యుల డిమాండ్‌ను కూడా సానుకూలంగా పరిశీలించడానికి మంత్రి ఆంగీకరించారు. పలు డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిన నేపథ్యంలో వైద్యులు తమ ఆందోళన విరమించుకుని విధుల్లో చేరాలని మంత్రి కోరారు. త్వరలో మరోసారి వైద్యుల సంఘం ప్రతినిధులతో చర్చలు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కమిషనర్ హరికిరణ్ ఇతర అధికారులు పాల్గొన్నారు.