రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖలో జవసత్వాలు నింపుతోంది. పంచాయతీలను గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం.. విద్యుత్ చార్జీల పేరుతో వాటి నిధులను నేరుగా వాడేసింది. పంచాయతీల ఖాతాల్లో ఒక్క పైసా కూడా లేకపోవడంతో బ్లీచింగ్ పౌడర్ కూడా కొనుగోలు చేయలేని దుస్థితి నెలకొంది. దీనికితోడు ఎక్కడైనా పనులు చేసి, సీఎ్‌ఫఎంఎ్‌సలో బిల్లులు పెడితే ఆర్థికశాఖ డబ్బులు విడుదల చేసేది కాదు. ఇచ్చిన నిధులు సద్వినియోగం కాకపోవడంతో రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలను కేంద్రం బ్లాక్‌లి్‌స్టలో పెట్టింది. దీంతో గతంలో రావాల్సిన ఆర్థికసంఘం నిధులు నిలిచిపోయాయి. దీనిపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కేంద్ర అధికారులతో సంప్రదించి లైన్ క్లియర్ చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి శశిభూషణ్‌కుమార్, కమిషనర్ కృష్ణతేజ చొరవ తీసుకుని రాష్ట్రానికి ఆర్థిక సంఘం నిధులు త్వరగా తీసుకురావడానికి కృషి చేశారు. వీరి ప్రయత్నాలు ఫలించడంతో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు మొదటి విడతగా రూ.989 కోట్లు మంజూరు చేస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో నేరుగా జమచేయనుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ సర్పంచ్‌లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు వచ్చిన తర్వాతే ఆర్థిక సంఘం నిధులకు మోక్షం కలిగిందని, దీంతో గ్రామ పంచాయతీలకు సుమారు రూ.2వేల కోట్లు వచ్చినట్లయిందని పేర్కొంటున్నారు. ఈ నిధులు జమ అయిన తర్వాత పంచాయతీల్లో చేపట్టే పనులపై నిఘా ఉంటుందని కమిషనర్ కృష్ణతేజ తెలిపారు. దీనికి సంబంధించి ఒక పోర్టల్‌ను రూపొందించామని, ఇప్పటికే రెండు పంచాయతీల్లో పైలట్ ప్రాజెక్టు కింద అమలు చేశామని పేర్కొన్నారు. త్వరలో ఈ పోర్టల్‌ను అమల్లోకి తెచ్చి పంచాయతీల్లో లెక్కలు పక్కాగా, పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. నిబంధనలు ఉల్లంఘించి ఖర్చు చేస్తే అధికారులతో పాటు సర్పంచ్‌లపైనా చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు.