వంద రోజుల కూటమి ప్రభుత్వంలో వెయ్యి అడుగులు వేశాం. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి కుంటు పడిపోయింది. ఐదేళ్లలో 3 శాతం గ్రోత్ రేట్ తగ్గింది. దీంతో బాగా వెనకబడ్డాం’’ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తవుతున్న నేపథ్యంలో కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఎంత భయకరమైన పరిస్థితులు ఉన్నాయో తెలిసిందే. నన్ను అరెస్టుచేసిన రోజున పవన్ కల్యాణ్ హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ప్రయత్నించారు. కానీ, ఆ ఫ్లైట్‌ను రద్దు చేశారు. అయినా సరే ఆయన రోడ్డు మార్గంలో వచ్చారు. నందిగామ వద్ద రోడ్డు బ్లాక్ చేశారు. దీంతో రోడ్డు మీద ధర్నా చేశారు. సినిమావాళ్లు షూటింగ్‌లో తప్ప బయట ఇవన్నీ చేయరు. కానీ, పవన్ నిజ జీవితంలో కూడా పోరాట యోధుడుగా నిలబడ్డారు. ఆయన రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చారు. 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. ఆనాడు ఆయన పోటీ చేయకుండా ఎన్డీయే గెలవాలని కోరుకున్నారు. నేను జైలులో ఉన్నప్పుడు అక్కడకు వచ్చి మాట్లాడారు. తర్వాత బయటకు వెళ్లి జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని చెప్పారు. బీజేపీతో ఆయన పొత్తులో ఉన్నా కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి వీల్లేదని బీజేపీని ఒప్పించి కూటమిలోకి తీసుకువస్తామని చెప్పారు. సీట్ల పంపకాల్లో ఎక్కడా అభిప్రాయ బేధాలకు తావులేకుండా పని చేశాం. కూటమి రావడానికి ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి కూడా కృషి చేశారు. ఆమె స్థానంలో వేరేవాళ్లు ఉంటే ఏమయ్యేదో తెలీదు. నేను, పవన్ ఒక ఒప్పందానికి వచ్చాం. ఒక ప్రెస్‌మీట్ పెట్టాం. ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తున్నదీ చెప్పాం. బీజేపీ పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లాం. అమిత్‌షా, జేపీ నడ్డా కూడా మూడుపార్టీల కలయికకు ఓకే చెప్పారు. కానీ, ఇలా చేస్తే నష్టం జరుగుతుందని చాలా మంది అన్నారు. కాదు లాభం వస్తుందని చెప్పాం. అదే ఈ రోజు జరిగింది. వంద రోజులు పూర్తి చేశాం. మోదీ మూడోసారి ప్రధానిగా వంద రోజులు పూర్తి చేసుకున్నారు. కేంద్రంలో అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్‌పై ఉన్న ఏపీని కాపాడుకోవడం చాలా కష్టమై పోయేది’’ అని అన్నారు.