సీఎం చంద్రబాబు విజన్ సూపర్. ఆయన ఆలోచనలు దశాబ్దం ముందుంటాయి. 2047 నాటికి ఏపీ నెంబర్ వన్‌గా ఉండాలన్న సంకల్పంతో పని చేస్తున్నారు. ఆయన ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తాం’’ అని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకోనున్న సందర్భంగా మంగళగిరిలోని ఓ కన్వెన్షన్ సెంటర్‌లో నిర్వహించిన కూటమి పార్టీల సమావేశంంలో పవన్ ప్రసంగించారు. ‘‘సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఏపీ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి సాధించాలి. ఒక తల్లికిపుట్టిన ఇద్దరు పిల్లలే ఒకలా ఉండరు. అలాంటిది మూడు విభిన్నమైన పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. పార్టీలు వేరైనా ఆత్మ ఒక్కటే. బీజేపీ, టీడీపీ, జనసేన పార్టీలు మూడుగా కనిపించినా గుండె చప్పుడు మాత్రం ఒక్కటే. విపక్ష నేతగా ఉన్నప్పుడు చంద్రబాబును రాజమండ్రి జైల్లో పెట్టారు. విజయవాడ వస్తున్న నన్ను కూడా ఆపారు. నేను ఆ రోజే ప్రభుత్వం మారబోతోందని చెప్పాను. అదే జరిగింది. ఇప్పటం గ్రామంలో నిర్వహించిన సభలో వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమోమని ప్రతిపాదన చేశా. ఆ సమయంలో రాష్ట్రం బాగుండాలనే బలీయమైన కోరిక తప్ప మరొకటి లేదు. అది సాధించడానికి ఎన్నో అవరోధాలు ఎదుర్కొన్నాం’ అని అన్నారు.