ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు చౌక మద్యాన్ని(చీప్ లిక్కర్) అందుబాటు ధరలకే అందించాలని టీడీపీ కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. క్వార్టర్ రూ.99కే అందుబాటులోకి తీసుకురానుంది. సాధారణ లిక్కర్ షాపులతో పాటు కేవలం ప్రీమియం రకం మద్యం బ్రాండ్లు మాత్రమే ఉండే ఎలైట్ షాపుల ఏర్పాటుకూ ఆమోదముద్ర వేసింది. మద్యం దుకాణాల్లో పది శాతాన్ని కల్లుగీత కులాలకు కేటాయించాలని నిశ్చయించినట్లు సమాచార-పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. అక్టోబరు నుంచి నూతన మద్యం పాలసీ అమల్లోకి వస్తుందన్నారు. బుధవారమిక్కడ వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయాలను వివరించారు. 2023 ఆగస్టు 15 నుంచి 2024 ఆగస్టు 15 వరకు గ్రామ/వార్డు వలంటీర్ల సర్వీసును పొడిగిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కేబినెట్ విభేదించిందన్నారు. వలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై లోతైన అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. వార్తా పత్రిక కొనుగోలు కోసం వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు నెలకు రూ.200 చొప్పున అదనపు ఆర్థిక సాయం అందించేందుకు గత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని చేసిన ప్రతిపాదనలను కూడా కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. ‘రాజకీయ లబ్ధి కోసం, ఎవరికో ఆర్థిక లబ్ధి చేకూర్చేందుకు ఇచ్చిన ఈ జీవోల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి రూ.205 కోట్ల నష్టం వాటిల్లింది. దీనిపై కమిటీ వేసి పూర్తి వివరాలను సేకరించాలని ముఖ్యమంత్రి సూచించారు. భోగాపురం ఎయిర్‌పోర్టుకు అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంగా నామకరణం చేస్తూ అసెంబ్లీ ఉభయ సభల ముందుంచే తీర్మానం, కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయడానికి చేసిన ప్రతిపాదనను మంత్రిమండలి ఆమోదించింది’ అని చెప్పారు.