ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ‘వైఎస్సార్ లా నేస్తం’ పేరు మార్పు చేస్తూ.. ‘న్యాయ మిత్ర’ గా మార్చింది. లా డిపార్ట్‌మెంట్‌లో అమలవుతున్న ఈ పథకాన్ని ‘న్యాయ మిత్ర’గా మార్చాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ పథకానికి సంబంధించి వివరణాత్మక మార్గదర్శకాలు నిర్ణీత సమయంలో జారీ చేయబడతాయని ఉత్తర్వుల్లో వెల్లడించింది. సీఈవో ఈ-ప్రగతి అథారిటీ విషయంలో తదనుగుణంగా తదుపరి అవసరమైన చర్య తీసుకోవాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయ శాఖ ప్రభుత్వ కార్యదర్శి వి సునీత ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పథకం ద్వారా న్యాయ శాస్త్రం పట్టా చేతపట్టుకుని న్యాయవాద వృత్తిలోకి కొత్తగా అడుగుపెట్టిన జూనియర్ న్యాయవాదులకు ప్రతి నెలా రూ. 5వేలు స్టైపండ్ ఇస్తారు. ఇందులో భాగంగా గత ప్రభుత్వం 2019 డిసింబర్‌లో ఈ పథకాన్ని ప్రారంభించింది. కాగా ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం హామీల, పథకాల అమలుపై ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కొన్ని హామీలు, పథకాలను అమలు చేస్తోంది.. మరికొన్ని అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే గత జగన్ సర్కార్ హయాంలో ఉన్న కొన్ని పథకాలను కొనసాగిస్తోంది.. కాకపోతే వాటికి పేర్లు మారుస్తోంది. ఇప్పటికే కొన్ని పథకాలకు పేర్లను మారుస్తూ నిర్ణయం తీసుకుంది. తాజాగా వైఎస్పార్ లా నేస్తం పేరు మార్పు చేస్తూ.. ‘న్యాయ మిత్ర’గా మార్చింది. ఈ పథకం పేరు మార్చినా కొనసాగించడంపై జూనియర్ న్యాయవాదులు ఆనందం వ్యక్తం చేశారు.