మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్‌పై సొంత బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమవారం డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. అనిల్ కుమార్ యాదవ్ ఒక ఆర్కెస్ట్రా ఆర్టిస్ట్ అంటూ వ్యాఖ్యలు చేశారు. మంత్రి నారాయణ మీద పెట్టినన్ని కేసులు, వేధింపులు ఎవరి మీద ఉండవన్నారు.అక్రమ అరెస్టులు, వేధింపులు తట్టుకొని 72 వేల ఓట్ల మెజార్టీతో నారాయణ గెలిచారన్నారు. అనిల్ కుమార్ యాదవ్ లాగా భయపడి నియోజకవర్గం నుంచి వెళ్ళిపోలేదన్నారు. ప్రతి సంవత్సరం పది కోట్లు సొంత నిధులు కార్యకర్తలకు కేటాయించిన నాయకుడు నారాయణ అని చెప్పుకొచ్చారు. వీపీఆర్ దంపతుల పేర్లు ఉచ్చరించే అర్హత కూడా అనిల్‌కు లేదన్నారు.
ఫతేఖాన్ పేటలో కూల్డ్రింక్ షాపులో పనిచేసుకునే అనిల్, ఎమ్మెల్యే ఎలా అయ్యారు అని ప్రశ్నించారు. నెల్లూరు జిల్లాను అనీల్ కుమార్ యాదవ్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అనిల్ కుమార్ యాదవ్‌ను ఎమ్మెల్యేని, మంత్రిని చేసింది తమ లాంటి కార్యకర్తలే అని తెలిపారు. 17 ఏళ్లు షఫ్ట్ ఆపరేటర్‌గా పని చేసిన వ్యక్తికి.. అదే పోస్టును రూ.7 లక్షలకి అమ్ముకున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీలోకి వెళ్తున్న కార్పొరేటర్లని టీడీపీలోకి వద్దు, జనసేన పార్టీలోకి వెళ్ళమని చెబుతూ అనిల్ వైసీపీకి వెన్నుపోటు పొడుస్తున్నారంటూ డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ విరుచుకుపడ్డారు.