బ్యాంకుల్లో సేవింగ్స్ అకౌంట్ల కంటే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ వస్తుందన్న సంగతి తెలిసిందే. ఇది ఒక ఆకర్షణీయ పెట్టుబడి పథకం అని చెప్పొచ్చు. ముఖ్యంగా పెద్దగా రిస్క్‌కు ఇష్టపడని సీనియర్ సిటిజెన్లు ఫిక్స్‌డ్ డిపాజిట్లను అట్రాక్టివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గా పరిగణిస్తుంటారు. ఇక డిపాజిట్లపై వడ్డీ రేట్లు.. నిర్ణీత కాల వ్యవధిని బట్టి నిర్దేశిస్తారు. ఇక వడ్డీ రేట్లు బ్యాంకుల్ని బట్టి మారుతుంటాయి. ఒక్కో బ్యాంకులో ఒక్కో రకంగా.. ఒక్కో టెన్యూర్ ఎఫ్‌డీపై ఒక్కోలా ఉంటాయని చెప్పొచ్చు. ప్రముఖ ప్రభుత్వ బ్యాంకుల కంటే ప్రైవేట్ బ్యాంకుల్లో ఎక్కువ వడ్డీ వస్తుంది. ఇదే సమయంలో ప్రైవేట్ బ్యాంకులకు మించి స్మాల్ ఫైనాన్స్ బ్యాంకుల్లో వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు. దాదాపు ప్రతి నెలలోనూ బ్యాంకులు డిపాజిట్ల వడ్డీ రేట్లను మారుస్తుంటాయి.
సెప్టెంబర్ నెలలో ఇప్పటికే పలు బ్యాంకులు డిపాజిట్లపై కొత్త వడ్డీ రేట్లు ప్రకటించాయి. వీటి లిస్ట్ చూద్దాం. దేంట్లో ఏ టెన్యూర్ ఎఫ్‌డీపై వడ్డీ ఎంత వస్తుందో తెలుసుకుందాం. ఇండస్‌ఇండ్ బ్యాంక్ కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 11 నుంచి అమలవుతున్నాయి. ఇక్కడ సాధారణ ప్రజలకు వారం నుంచి పదేళ్ల వ్యవధి డిపాజిట్లపై 3.50 శాతం నుంచి 7.99 శాతం వరకు అందుతుంది. సీనియర్ సిటిజెన్లకు 4 శాతం నుంచి 8.25 శాతంగా ఉంది. అత్యధికంగా సాధారణ ప్రజలకు 7.99 శాతం వడ్డీ.. 16 నెలల నుంచి 18 నెలల వరకు డిపాజిట్లపై ఉంది. సీనియర్ సిటిజెన్లకు దీనితో పాటు 12-15 నెలలు; 15-16 నెలలు; 18 నెలల నుంచి రెండేళ్ల ఎఫ్‌డీపై ఉంది.
ఫెడరల్ బ్యాంకు కూడా వడ్డీ రేట్లు మార్చేసింది. ఇక్కడ సెప్టెంబర్ 16 నుంచి ఇవి అమల్లోకి వచ్చాయని చెప్పొచ్చు. దీంట్లో సవరించిన తర్వాత సాధారణ ప్రజలకు వడ్డీ రేట్లు 7 రోజుల నుంచి 10 సంవత్సరాల వ్యవధి డిపాజిట్లపై 3 నుంచి 7.40 శాతంగా ఉండగా.. సీనియర్ సిటిజెన్లు ఇక్కడ 3.50 శాతం నుంచి 7.90 శాతం వడ్డీ అందుకుంటున్నారు. అత్యధిక వడ్డీ ఇక్కడ 777 రోజులు, 50 నెలల డిపాజిట్లపై వస్తుంది.
బ్యాంక్ ఆఫ్ బరోడాలో రెగ్యులర్ సిటిజెన్లకు 4.25 శాతం నుంచి 7.30 శాతం వరకు ఉండగా.. సీనియర్ సిటిజెన్లకు 4.75 శాతం నుంచి 7.80 శాతంగా ఉన్నాయి. ఇది సెప్టెంబర్ 5 నుంచే అమలవుతోంది. ఇక్కడ అత్యధిక వడ్డీ రేటు బ్యాంక్ స్పెషల్ స్కీమ్.. బీఓబీ మాన్సూన్ ధమాకా ప్లస్ డిపాజిట్ స్కీం 399 రోజుల టెన్యూర్‌పై ఉంది.
కర్ణాటక బ్యాంకులో సాధారణ ప్రజలకు 3.50 శాతం నుంచి 7.50 శాతం వరకు; సీనియర్ సిటిజెన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు ఎక్కువ ఇస్తోంది. 375 రోజుల డిపాజిట్‌పైనే అధిక వడ్డీ అందుతుంది. ఇక చివరగా యాక్సిస్ బ్యాంకులో చూస్తే.. 7 రోజుల నుంచి 10 ఏళ్ల వ్యవధి డిపాజిట్లపై 3 నుంచి 7.25 శాతం వడ్డీ అందుతుండగా.. సీనియర్ సిటిజెన్లు 3.50 శాతం నుంచి 7.75 శాతం వరకు వడ్డీ పొందుతున్నారు.