తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్యమైన గమనిక.. సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని టీటీడీ తెలిపింది. లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉందంటూ జరుగుతున్న ప్రచారం వాస్తవం కాదని.. పవిత్రమైన శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు, కొంతమంది భక్తులు సోషల్ మీడియాలో వైరల్ చేయడం భావ్యం కాదన్నారు. తిరుమలలోని లడ్డూ పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారుని.. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుందన్నారు. ఇంతటి పకడ్బందీగా లడ్డూలు తయారు చేసే వ్యవస్థలో ఈ విధంగా పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయమని..ఈ విషయాన్ని భక్తులు గమనించాలంటోంది టీటీడీ.
తిరుమల లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతుండగానే.. తెలంగాణకు చెందిన భక్తురాలు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో గుట్కా ప్యాకెట్ ఉందని ఆరోపించడం కలకలంరేపింది. ఖమ్మం జిల్లా కొల్లగూడెంకు చెందిన పద్మావతి ఇటీవల తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లారు.. స్వామివారి సేవలో పాల్గొన్న తర్వాత లడ్డూ ప్రసాదాన్ని కొనుగోలు చేసినట్లు తెలిపారు. తిరుమలలో కొనుగోలు చేసిన లడ్డూలో గుట్కా ప్యాకెట్ ఉన్నట్లు ఆమె ఆరోపించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఘటనపై టీటీడీ ప్రకటన చేసింది.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని సూచించింది.
మరోవైపు తిరుమల శ్రీవారిని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు దిగ్విజయంగా జరగాలని స్వామి వారిని కోరుకున్నానని.. వచ్చే నెల 4న ప్రారంభమయ్యే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగమ శాస్త్రానికి అనుగుణంగా పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందే విధంగా టీటీడీ చర్యలు తీసుకుంటుందని.. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం సమసిపోయిందని.. దాని గురించి ఆలోచన అవసరం లేదన్నారు. రాబోయే బ్రహ్మోత్సవాలపైనే తమ దృష్టి ఉందన్నారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి అంశంపై ఐజీ స్థాయి అధికారితో సిట్ దర్యాప్తునకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. తిరుమలలో దోషం పోవడానికి మహా శాంతి యాగం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారని.. ఏ గ్రేడ్ క్వాలిటీ ముడి పదార్థాలతోనే తిరుమల ప్రసాదం తయారు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. తిరుమలలో ఎలాంటి అపవిత్ర కార్యక్రమాలకు ఆస్కారం లేదని.. అలాంటి కార్యక్రమం ఎవరు నిర్వహించినా ఉపేక్షించేది లేదన్నారు. త్వరలోనే టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేస్తామని.. 27 వేల ఆలయాలకు పాలకమండళ్ల నియామకాలు ఉంటాయన్నారు. రాష్ట్రంలో కాణిపాకం, శ్రీ కాళహస్తి, శ్రీశైలం, విజయవాడ కనకదుర్గ, ద్వారకా తిరుమల, అన్నవరం, సింహాచలం అప్పన్న ఆలయాలలో మహా శాంతి యాగం నిర్వహణ చేపట్టామన్నారు. అలాగే అన్ని ఆలయాల్లో ప్రసాదాల నాణ్యతపై పరిశీలన జరుగుతోందని.. సిట్ నివేదిక రాగానే అన్నిటిపై చర్యలు తీసుకుంటామన్నార. తప్పు చేసిన ప్రతి ఒక్కరికి శిక్ష తప్పదన్నారు మంత్రి.