ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ముడా కుంభకోణం.. కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ

national |  Suryaa Desk  | Published : Tue, Sep 24, 2024, 11:34 PM

మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) భూముల కేటాయింపులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనపై విచారణకు గవర్నర్ ఆమోదించడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు మంగళవారం తిరస్కరించింది. గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సీఎం సిద్ధరామయ్య వేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. గవర్నర్ స్వతంత్ర నిర్ణయం తీసుకోవచ్చని పేర్కొంది. ఆయన తన స్వీయ నిర్ణయాధికారాన్ని సక్రమంగా అన్వయించారని వ్యాఖ్యానించింది. ఆయన ఆదేశాలకు (ముఖ్యమంత్రిని విచారించడానికి) సంబంధించినంత వరకు, గవర్నర్ చర్యలలో ఎటువంటి తప్పిదం లేదని కోర్టు అభిప్రాయపడింది.


ముడా భూముల కేటాయింపుల్లో సీఎం సిద్ధరామయ్య సతీమణి పార్వతితో పాటు మరికొందరి ప్రమేయం ఉందని ఆరోపిస్తూ సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుపై గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ స్పందించారు. ఈ కేసులో సీఎం సిద్ధరామయ్యను విచారించాలని ఆయన ఆదేశాలు జారీచేశారు. దీనిని సిద్ధూ గత నెలలోనే హైకోర్టులో సవాల్ చేయగా.. స్వల్ప ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వెలువరించే వరకూ ముందుకెళ్లొద్దని సూచించింది. తాజాగా, ఈ పిటిషన్‌పై తీర్పు వెలువరించిన జస్టిస్ నాగప్రసన్న ధర్మాసనం.. గవర్నర్ చర్యను సమర్దించింది. సిద్ధరామయ్య పిటిషన్‌ను తిరస్కరించింది. ముడా భూకేటాయింపుల్లో జరిగిన అవకతవకల్లో పార్వతి హస్తం ఉందని ప్రధాన ప్రతిపక్షం బీజేపీ కొన్నాళ్లుగా ఆరోపిస్తోంది. .


ఏంటీ ‘ముడా’ వివాదం


మైసూరు సమీపంలోని కెసరె గ్రామంలో సిద్ధరామయ్య సతీమణి పార్వతి పేరుతో మూడు ఎకరాల భూమి ఉండేది. ఆ భూమిని పార్వతి సోదరుడు ఆమెకు కానుకగా ఇచ్చారు. అయితే అభివృద్ధి పనుల్లో భాగంగా మైసూర్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ముడా) దానిని స్వాధీనం చేసుకుంది. దీనికి పరిహారంగా 2021లో విజయనగర ప్రాంతంలో 38,283 చదరపు అడుగుల ప్లాట్లను కేటాయించింది. కెసరెలోని భూమితో పోలిస్తే.. దీని ర్కెట్‌ ధర చాలా ఎక్కువగా ఉంది. అదే బీజేపీ విమర్శలకు కారణమైంది. ఆ పార్టీ హయాంలోనే ఈ కేటాయింపు జరగడం గమనార్హం.


సిద్ధరామయ్య ఇదే వాదన చేస్తున్నారు. తాను ఎటువంటి అక్రమాలకు పాల్పడలేదని చెబుతున్నారు. తమ భూమిని ముడా తీసుకుందని, పరిహారానికి తన సతీమణి అర్హురాలని అంటున్నారు. 2014లో తాను సీఎంగా ఉన్న సమయంలో పరిహారం కోసం ఆమె దరఖాస్తు చేసుకుందని గుర్తు చేశారు. కానీ, తాను ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఆ పరిహారం ఇవ్వడం కుదరదని చెప్పానన్నారు. దాంతో 2021లో మరోసారి దరఖాస్తు చేసుకోగా.. అప్పటి బీజేపీ ప్రభుత్వం విజయనగరలో భూమి కేటాయించిందని అంటున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com