తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి మరోసారి నోరుజారారు. ఈసారి ఏకంగా దేశానికి లౌకివాదం అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఐరోపాకు చెందిన సెక్యులరిజం భావనను.. లౌకికవాదం పేరుతో భారతీయులపై రుద్ది మోసం చేశారని ఆయన ఆరోపించారు. ఆదివారం కన్యాకుమారిలో హిందూధర్మ విద్యాపీఠం 41వ మహాసభ, 35వ స్నాతకోత్సవానికి తమిళనాడు గవర్నర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్‌ఎన్ రవి మాట్లాడుతూ... ‘ఈ దేశ ప్రజలపై ఎన్నో మోసాలు జరిగాయి.. వాటిలో ఒకటి లౌకికవాదానికి తప్పుడు భాష్యం. లౌకికవాదం అంటే ఏమిటి? లౌకికవాదం అనేది ఐరోపా భావన. భారతీయ భావన కాదు’ అని వ్యాఖ్యానించారు.
ఐరోపాలో చర్చికి, రాజుకు మధ్య జరిగిన ఘర్షణ వల్ల సెక్యులరిజం భావన పుట్టుకొచ్చిందని తెలిపారు. కానీ, భారత స్వాత్రంత్య్రం తర్వాత రాజ్యాంగాన్ని రూపొందించే సమయంలో ఎవరో సెక్యులరిజం గురించి చర్చించారని ఆయన చెప్పారు. ‘రాజ్యాంగ పరిషత్ ఏం చెప్పింది.. మన దేశంలో సెక్యులరిజం ఉందా? ఏదైనా సంఘర్షణ జరిగిందా?’ అని ఆర్ఎన్ ప్రశ్నించారు. ధర్మం నుంచి భారతదేశం పుట్టిందని, అలాంటప్పుడు ధర్మంలో వైరుధ్యం ఎలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘సెక్యులరిజం అనేది యూరోపియన్ భావన. అది అక్కడే ఉండాలి. భారత్‌లో సెక్యులరిజం అవసరం లేదు’ అని స్పష్టం చేశారు. భారతదేశ ప్రజలపై అనేక తప్పిదాలు జరిగాయి.. అందులో ఒకటి లౌకికవాదం అని అన్నారు.
అంతేకాదు, 1976లో రాజ్యాంగ పీఠికలో ‘సెక్యులరిజం’ అనే పదాన్ని చేర్చిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై గవర్నర్ ఆర్‌ఎన్ రవి ఈ సందర్భంగా విమర్శలు గుప్పించారు. ‘రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 25 ఏళ్ల తరువాత, ఎమర్జెన్సీ కాలంలో, అసురక్షిత ప్రధానమంత్రి, కొన్ని వర్గాల ప్రజలను సంతోషపెట్టే ప్రయత్నంలో లౌకికవాదాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టారు’ అని వ్యాఖ్యానించారు.
కాగా, తమిళనాడు గవర్నర్ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా స్పందించాయి. సీపీఎం నేత సీనియర్ నేత బృందాకారత్.. రాజ్యాంగం అంటే ఆయనకు గౌరవం లేదని మండిపడ్డారు. ‘గవర్నర్ వ్యాఖ్యలను బట్టి రాజ్యాంగం కూడా విదేశీ భావనే అన్నట్టు ఉంది.. రాజ్యాంగంపై నమ్మకం లేనివారు, దానిని ప్రశ్నించే వారు గవర్నర్ కుర్చీలో కూర్చున్నారు.. దేశానికి అత్యున్నత నియమావళిపై నమ్మకంలేని వారిని బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గవర్నర్లుగా నియమిస్తోంది’ అని ఆమె విమర్శించారు.
తమిళనాడుకు చెందిన కాంగ్రెస్ ఎంపీ మాణికమ్ ఠాగూర్ ఘాటుగానే స్పందించారు. ‘సెక్యులరిజం అనే ఆలోచన విదేశాలకు భిన్నమైంది.. భారతీయులమైన మనం అన్ని మతాలు, ఇతర సంప్రదాయాలు, ఆచారాలను గౌరవిస్తాం.. ఇదే భారత్‌లో ఉన్న లౌకికవాదం’ అని అన్నారు.