ఇటీవల దేశంలోని పలుచోట్ల రైలు పట్టాలపై గుర్తు తెలియని వ్యక్తులు ప్రమాదకర వస్తువులను అడ్డుగా పెడుతున్న ఘటనలు పెద్ద సంఖ్యలో చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. రైలు పట్టాలను తప్పించి, భారీ విధ్యంసానికి కుట్రలు చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు రోజుల కిందట గుజరాత్‌లోని సూరత్ జిల్లా కిమ్-కోసాంబ మధ్య కిమ్ వంతెన సమీపంలో రైల్వే ట్రాక్‌పై గుర్తుతెలియని వ్యక్తులు సిలిండర్ పెట్టి.. సేఫ్టీ పిన్ ఇలాస్టిక్ రైల్ క్లిప్‌ను తొలగించారు. ఆ మార్గంలో వెళ్లే రైలు ప్రమాదానికి గురయ్యేలా చేయాలనే కుట్రచేసినట్టు భావించారు. అయితే, ఈ ఘటనపై పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.
ఇదంతా రైల్వే ఉద్యోగుల కట్టుకథని తెలిసి పోలీసులు అవాక్కయ్యారు. ప్రమాదాన్ని తప్పిస్తే రైల్వే శాఖ ఇచ్చే రివార్డు కోసమే ఇలా చేసినట్టు దర్యాప్తులో వెల్లడయ్యింది. ముగ్గురు ట్రాక్‌మెన్లు ఈ కన్నింగ్ ప్లాన్ వెనుక ఉన్నట్టు గుర్తించారు. పట్టాలపై సేఫ్టీ పిన్ ఇలాస్టిక్ రైల్ క్లిప్‌లను తొలగించి.. ఇనుప ప్లేట్లను ఉంచి ఫోటోలు, వీడియోలు తీశారు. అనంతరం ఎవరో రైలు ప్రమాదానికి కుట్రచేశారని, వాటిని తాము సకాలంలో గుర్తించిన తొలగించడంతో పెను ప్రమాదం తప్పిందని కట్టుకథ అల్లారు. ఈ ఘటనలో ముగ్గుర్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. వివరాలను మీడియాకు వెల్లడించారు.
కిమ్-కోసాంబ మార్గంలో పట్టాలపై గ్యాస్ సిలిండర్ గుర్తించిన కేసులో ఇద్దరు ట్రాక్‌మెన్లు సుభాష్ పోడార్, మనీశ్ మిస్త్రీతో పాటు కాంట్రాక్ట్ వర్కర్ శుభమ్ జైస్వాల్‌ను అరెస్ట్ చేసినట్టు చెప్పారు. బిహార్‌లోకి భాగల్పూర్‌కు చెందిన రమేశ్ పోడార్, పట్నాకు చెందిన మిస్త్రీ, యూపీకి చెందిన జైస్వాల్ ముగ్గురూ కిమ్‌లోనే నివాసం ఉంటున్నారని తెలిపారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయినట్టు వివరించారు.
శనివారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముగ్గురు అనుమానిత వ్యక్తులు పట్టాలపై పరుగెత్తి వెళ్తుండగా.. తాము చూసి వారిని వెంబడించామని పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో ట్రాక్‌పై ఎలాస్టిక్ రైల్ క్లిప్ కీస్, రెండు ఇనుప ప్లేట్లను గుర్తించి తొలగించామని, వీటిని 25 నిమిషాల కిందటే అమర్చారని నిందితులు చెప్పడంతో అంత తక్కువ సమయంలో వీళ్లు ఎలా గుర్తించారని పోలీసులకు అనుమానం వచ్చింది. వారి మొబైల్ ఫోన్లను పరిశీలించగా.. పట్టాలపై ఉన్నవాటిని తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటల మధ్య తొలగించినట్టు గుర్తించారు. దీనిపై పోలీసులు వివరణ అడిగితే నీళ్లు నమిలారు. దీంతో వీరే ఇదంతా చేసినట్టు నిర్దారణకు వచ్చి.. అదుపులోకి తీసుకుని విచారించడంతో విషయం బయటపడింది.