అమెరికాలో పర్యటిస్తోన్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొడిమిర్ జెలెన్‌స్కీ భేటీ అయ్యారు. ఇరువురి మధ్య జరిగిన ద్వైపాక్షిక భేటీలో ఉక్రెయిన్‌లో శాంతి స్థాపనకు భారత్ మద్దతును మోదీ పునరుద్ఘాటించారు. దాదాపు నెల రోజుల వ్యవధిలో జెలెన్‌స్కీ, మోదీలు రెండోసారి భేటీ కావడం గమనార్హం. జెలెన్‌స్కీతో భేటీ గురించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రధాని మోదీ వెల్లడించారు. గత నెలలో ఉక్రెయిన్ పర్యటన సందర్భంగా చెప్పినట్టుగానే శాంతిస్థాపన అమలుకు భారత్ కట్టుబడి ఉందని... శాశ్వతమైన, శాంతియుతమైన పరిష్కారాన్ని సులభతరం చేయడానికి అన్ని మార్గాల్లో సిద్ధంగా ఉందని తెలిపారు.
‘మేము ఇరుదేశాల మధ్య సంబంధాలను మరింత ఉన్నత దశకు చేరుకునేలా అభివృద్ధి చేస్తున్నాం. వివిధ రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి కలిసి పనిచేస్తున్నాం.. అంతర్జాతీయ వేదికపై ముఖ్యంగా ఐక్యరాజ్యసమతి, జీ20 సదస్సులలో శాంతి సూత్రాన్ని అమలుచేయడం, రెండో శాంతి శిఖరాగ్ర సమావేశం వంటి పలు అంశాలపై చర్చించాం... అలాగే మన సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతకు స్పష్టమైన మద్దతు ఇచ్చినందుకు కృతజ్ఞతలు’ అని జెలెన్‌స్కీ తెలిపారు.
ఆగస్టు 23న ఉక్రెయిన్‌లో పర్యటించిన మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో భేటీ అయిన విషయం తెలిసిందే. ఈ పర్యటన సందర్భంగా రష్యా- ఉక్రెయిన్ సంఘర్షణ పరిష్కార మార్గాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఉక్రెయిన్‌లో శాంతిస్థాపనకు భారత్ మద్దతుగా నిలుస్తుందని మోదీ హామీ ఇచ్చారు. ఉక్రెయిన్‌లో తొలిసారి పర్యటించిన భారత ప్రధాని మోదీయే. 1992లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం తర్వాత.. ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించింది.
ఇక, సోమవారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని మోదీ.. మానవాళి విజయం.. యుద్ధక్షేత్రాల్లో కాకుండా ఉమ్మడి బలంలోనే దాగి ఉందని ఉద్ఘాటించారు. నమస్కార్ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోదీ... ప్రపంచంలోనే ఆరో వంతు ఉన్న 140 కోట్ల మంది భారతీయుల తరఫున తాను వాణిని వినిపిస్తున్నానని పేర్కొన్నారు.
ప్రపంచ భవితవ్యంపై అంతర్జాతీయ సమాజం చర్చిస్తున్న తరుణంలో.. మానవ కేంద్రంగా విధానాల రూపకల్పనకే అత్యంత ప్రాధాన్యం లభించాలని మోదీ అభిప్రాయపడ్డారు. సుస్థిరాభివృద్ధికి ప్రాధాన్యమిస్తూనే మానవ సంక్షేమం, ఆహారం, ఆరోగ్య భద్రతలను చూసుకోవాలని అభిప్రాయపడ్డారు. సుస్థిరాభివృద్ధి విజయవంతమవుతుందని ప్రపంచానికి చాటేలా భారత్‌లో 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చామని చెప్పారు. ఈ అనుభవాన్ని యావత్ ప్రపంచంతో పంచుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఓవైపు ఉగ్రవాద సమస్య; మరోపక్క సైబర్, సముద్రయానం, అంతరిక్ష రంగాల్లో ఎదురవుతున్న సరికొత్త సవాళ్ల నుంచి బయటపడేందుకు తగినస్థాయిలో ప్రయత్నాలు జరగాలని మోదీ ఆకాంక్షించారు