శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం నేపథ్యంలో, మాజీ సీఎం జగన్ ఈ నెల 28న తిరుమల వెళ్లి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకోవడం తెలిసిందే. అయితే, జగన్ తన తిరుమల పర్యటన సందర్భంగా ఆలయంలో డిక్లరేషన్ ఇస్తే బాగుంటుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ సూచించారు. మనం ఏమతానికి చెందిన వారమైనా అన్నిమతాలను గౌరవించాలని హితవు పలికారు. తాము చర్చి, మసీదులకు వెళ్లినపుడు వారి మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకుంటామని స్పష్టం చేశారు. జగన్ దేవుడి జోలికి వెళితే ఏమైందో గత ఎన్నికల్లో మీరంతా చూశారు అని లోకేశ్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో ఓ పాఠశాల పరిశీలన అనంతరం లోకేశ్ మీడియాతో మాట్లాడారు. తిరుమల వెళతానంటున్న జగన్ డిక్లరేషన్ ఇచ్చే సాంప్రదాయాన్ని పాటిస్తే బాగుంటుంది. తిరుమల లడ్డూ నాణ్యతా లోపంతో పాటు అనేక సమస్యలను భక్తులు యువగళం పాదయాత్రలో నా దృష్టికి తెచ్చారు. అధికారంలోకి వచ్చాక టీటీడీని ప్రక్షాళన చేయాలని ఈవోకు చెప్పాం. నెయ్యి సరఫరా చేసే కంపెనీ టర్నోవర్ రూ.250 కోట్లు ఉండాలన్న నిబంధనను వైవి సుబ్బారెడ్డి రూ.150 కోట్లకు తగ్గిస్తూ ఎందుకు సవరించారు? తిరుమలలో జరిగిన అవకతవకలపై నిగ్గు తేల్చేందుకు కమిటీ వేశాం. ఆ కమిటీ విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయి. ఇప్పుడు తిరుమల లడ్డూ క్వాలిటీ బాగుందని వైసీపీ ప్రజాప్రతినిధులు కూడా చెబుతున్నారు.