అమెరికా పర్యటనలో ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ బిజీబిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా మంత్రి పర్యటన సాగుతోంది. ఇందులో భాగంగా న్యూయార్క్‌లో వివిధ రంగాల ప్రముఖులతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమావేశమయ్యారు. ప్రపంచ బ్యాంకు సహజ వనరుల పరిరక్షణ ప్రాజెక్ట్ ప్రతినిధి మైక్ వెబ్‌స్టర్‌తో ఆయన సమావేశమయ్యారు. వరదలు కరువు నివారణ చర్యలపై చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో కలిసి పని చేస్తామని మైక్ వెబ్‌స్టర్ హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లాలో తాము చేపట్టిన కార్యక్రమాలకు చంద్రబాబు ప్రభుత్వ ప్రోత్సాహం, సహకారాన్ని ఈ సందర్భంగా మైక్ వెబ్‌స్టర్ గుర్తుచేసుకున్నారు. వరదలు, కరువు నివారణ చర్యలపై చేపట్టే ప్రాజెక్టులకు ప్రపంచ బ్యాంక్ ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుందని మైక్‌వెబ్‌స్టర్ స్పష్టంచేశారు. ఆపై సౌరశక్తి రంగంలో నూతన ఆవిష్కరణలపై షెల్ ఫౌండేషన్ సీఈవో జోనాథన్ బెర్మాన్, పోర్ట్‌ఫోలియో అధిపతి మీరా షాతో మంత్రి శ్రీనివాస్ చర్చించారు.
వ్యవసాయం రంగంలో సౌరశక్తి వినియోగాన్ని పెంచడం కోసం, నూతన ఆవిష్కరణలను రావాల్సిన అవసరంపై ఇరువురిని మంత్రి చర్చలు జరిపారు. అలాగే రాష్ట్ర అభివృద్ధి కోసం తమ వంతు సహకారం అందించేందుకు పలువురు ముందుకు రావటం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరును పలువురు కొనియాడటం పట్ల మంత్రి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. అమెరికాలోని న్యూయార్క్‌లో యూకే, ఆస్ట్రేలియా, అమెజాన్ ఫారెస్ట్ తదితర పలు దేశాలకు చెందిన వాణిజ్య, ఎన్జీవో సంస్థలకు చెందిన ప్రతినిధులతో మంత్రి బుధవారం సమావేశమయ్యారు. జనరల్ అట్లాంటిక్ ఫౌండేషన్ ప్రతినిధి కారా బార్నెట్, ములగో ఫౌండేషన్స్ సి.ఇ.ఓ. కెవిన్ స్టర్, బియాండ్ నెట్ జీరో చైర్మెన్ లార్డ్ జాన్ బ్రౌన్ తదితరులతో ఆయన చర్చలు జరిపారు. ఏపీలో వివిధ వాణిజ్య, పెట్టుబడి అవకాశాల గురించి వారి మధ్య చర్చ సాగింది. అలాగే రైతుల సంక్షేమం, వాతావరణ మార్పుల నియంత్రణ కార్యకలాపాల కోసం ఆంధ్ర ప్రదేశ్‌లో చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ప్రధానంగా చర్చించారు. ఏపీలో పెట్టుబడులకు సంబంధించి మంత్రి శ్రీనివాస్ విజ్ఞప్తిపై వివిధ సంస్థల ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు.