తిరుమల తిరుపతి దేవస్థానానికి పలాస నుంచి జీడిపప్పును గురువారం మధ్యాహ్నం పంపించారు. తిరుపతి వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జీడిపప్పు వినియోగానికి సంబంధించి పలాస వ్యాపారి కోరాడ సంతోష్‌కుమార్ ఇటీవల బిడ్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలిసారిగా 30 టన్నుల జేహెచ్(బద్ద) రకం జీడిపప్పును సిద్ధం చేశారు. ఓ లారీని సుందరంగా పూలదండలతో అలంకరించి.. దానికి గరుడ వాహనంగా నామకరణం చేశారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్‌నాయుడు, కింజరాపు అచ్చెన్నాయుడు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష జెండా ఊపి.. జీడిపప్పు లోడుతో ఆ వాహనాన్ని తిరుపతికి పంపించారు. ముందుగా వేంకటేశ్వరస్వామి చిత్రపటానికి పూజలు చేశారు.
జీడి కార్మికులు, వ్యాపారులు పెద్ద ఎత్తున పాల్గొని లారీని గోవిందనామ స్మరణతో సాగనంపారు. మంత్రులు, ఎమ్మెల్యే మాట్లాడుతూ పలాస జీడిపప్పును తిరుపతి బాలాజీ లడ్డూలో వినియోగించడం హర్షణీయమన్నారు. భవిష్యత్తులో పలాస ఖ్యాతి ప్రపంచ వ్యాప్తం కావాలని ఆకాంక్షించారు. ఎస్‌ఎస్‌ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రోస్ సంస్థ చైర్మన్ కోరాడ సంతోష్‌కుమార్ మాట్లాడుతూ.. వెంకటేశ్వరస్వామి తనకు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నామని, నాణ్యతలో రాజీ లేకుండా, భక్తిశ్రద్ధలతో జీడిపప్పు తయారు చేశామని తెలిపారు. కార్యక్రమంలో సంస్థ అడ్వయిజర్ అంధవరపు రతన్‌బాబు, పివి.సతీష్‌కుమార్, పారిశ్రామికవాడ అధ్యక్షుడు మల్లా రామేశ్వరరావు, టంకాల రవిశంకర్‌గుప్తా, పీరుకట్ల విఠల్‌రావు, సప్ప నవీన్, ఎం.నరేంద్ర(చిన్ని), గాలి కృష్ణారావు పాల్గొన్నారు.