ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలు చోట్ల వర్షాలు కురుస్తూ ఉన్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడుతోంది. ఈ నేపథ్యంలో దీని ప్రభావంతో శనివారం పలుచోట్ల వర్షాలు కురవనున్నాయి. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ వెల్లడించారు.
మరోవైపు అల్పపీడనం ప్రభావంతో ఉరుములు, మెరుపులు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ చెబుతోంది. ఈ నేపథ్యంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షం పడే సమయంలో.. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని చెబుతోంది. అలాగే వాన పడే సమయంలో పాడుబడిన భవనాలు, విద్యుత్ స్థంభాలకు దూరంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ముందస్తు జాగ్రత్తలు చేసింది. సముద్ర తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.
మరోవైపు ఏపీలో ఇటీవలి కాలంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆగస్టు నెల చివరిలో, సెప్టెంబర్ నెల ప్రారంభంలో కురిసిన వర్షాలతో ఏపీలో చాలా జిల్లాలు ప్రభావితమయ్యాయి. ముఖ్యంగా విజయవాడలో వచ్చిన వరదలు.. ఇంకా కళ్లముందు మెదులుతున్నాయి. విజయవాడ వరదల కారణంగా లక్షల మంది ప్రభావితులయ్యారు. 47 మంది వరకూ చనిపోగా.. భారీగా ఆస్తి, పంట నష్టం సంభవించింది. ఇక వరదల్లో నష్టపోయిన వారికి ఇటీవలే ప్రభుత్వం కూడా పరిహారం అందించిన విషయం తెలిసిందే. విజయవాడ వరదలు, భారీ వర్షాలు చూసిన జనం.. భారీ వర్షాలు అంటే భయపడిపోతున్నారు.