తిరుమలలో డిక్లరేషన్ వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్తుండటంతో ఈ డిక్లరేషన్ చర్చ మొదలైంది. తిరుమలకు వచ్చే అన్యమతస్తులు వెంకటేశ్వరస్వామిపై నమ్మకం, విశ్వాసం చూపుతూ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుందని ప్రభుత్వం, టీడీపీ కూటమి నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ తిరుమల డిక్లరేషన్ వ్యవహారంలో భూమన కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వరని, ఇవ్వాల్సిన అవసరం లేదని భూమన కరుణాకర్ రెడ్డి తేల్చి చెప్పారు. వైఎస్ జగన్‌ను డిక్లరేషన్ అడిగే హక్కు టీటీడీకి లేదన్నారు. ముఖ్యమంత్రి హాదాలో ఐదుసార్లు స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన వ్యక్తికి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.
వైఎస్ జగన్‌ను డిక్లరేషన్ అడిగితే ప్రభుత్వ పతనం ప్రారంభమైనట్లేనని భూమన కరుణాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వైఎస్ జగన్‌ను అడ్డుకుంటామని బీజేపీ నేతలు చెప్తున్నారన్న భూమన కరుణాకర్ రెడ్డి.. హిందువులంటే తామే అనే భావనలో బీజేపీ కార్యకర్తలు ఉన్నారన్నారు. టీటీడీ డిక్లరేషన్ మీద వైఎస్ జగన్ ఎందుకు సంతకం పెట్టాలని ప్రశ్నించారు. సాంప్రదాయ దుస్తుల్లో స్వామి వారి దర్శనానికి వెళ్తుంటే ఇంక డిక్లరేషన్ అవసరం ఏమటని ప్రశ్నించారు. డిక్లరేషన్ ఇవ్వకపోతే శ్రీవారి దర్శనానికి అనుమతి ఇవ్వమనే హక్కు టీటీడీకి లేదని స్పష్టం చేశారు. డిక్లరేషన్‌పై సంతకం చేయకుండానే తిరుమలకు వెళ్తామని.. తిరుమల శ్రీవారిని దర్శించుకుంటామని స్పష్టం చేశారు.
మరోవైపు వైఎస్ జగన్‌పై హత్యాయత్నం కుట్రలు చేస్తున్నారంటూ భూమన ఆరోపించారు. ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్ మీద భౌతిక దాడులు చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి చర్యలకు దిగితే ఊరుకునేది లేదని భూమన కరుణాకర్ రెడ్డి హెచ్చరించారు. మమ్మల్ని భయపెట్టాలనే భ్రమల్లో ఉన్నారన్న భూమన కరుణాకర్ రెడ్డి.. వైసీపీ కార్యకర్తలు ఎంత నిర్బంధిస్తే అంత పైకి లేస్తారన్నారు. గతంలో సోనియాగాంధీ కూడా డిక్లరేషన్ ఇవ్వలేదన్న భూమన కరుణాకర్ రెడ్డి.. దానికి తానే సాక్ష్యమని చెప్పుకొచ్చారు.
మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యల నేపథ్యంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. భూమన చెప్పినట్లుగానే వైఎస్ జగన్ డిక్లరేషన్ ఇవ్వకుండానే శ్రీవారి దర్శనానికి వెళ్తారా.. లేదా డిక్లరేషన్ మీద సంతకం చేస్తారా అనేది ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు వైఎస్ జగన్ తిరుమల పర్యటన నేపథ్యంలో కూటమి శ్రేణులు ఎలా స్పందిస్తాయనేదీ ఆసక్తికరంగా మారింది. పార్టీలతో పాటుగా హిందూ సంఘాలు కూడా డిక్లరేషన్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన హైటెన్షన్ రేపుతోంది. అటు టీటీడీ అధికారుల స్పందన మీద ఆసక్తి నెలకొంది.