ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగం వ్యవస్థగా భారతీయ రైల్వే గుర్తింపు పొందింది. ఇక, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్ అయిన ఇండియన్ రైల్వేకు దేశవ్యాప్తంగా 1.10 లక్షల కిలోమీటర్లకుపైగా లైన్ ఉంది. దీని ద్వారా రోజుకు 2 కోట్ల మందికిపైగా ప్రయాణికులకు సేవలు అందిస్తుంది. ఇక, రైల్వేకు అత్యధిక ఆదాయం సరకు రవాణా ద్వారా. వస్తుండగా. ఆ తర్వాత ప్రయాణికుల ద్వారా పెద్ద మొత్తంలో సమకూరుతుంది. ప్రస్తుతం శతాబ్ది, రాజధాని, వందేభారత్ వంటి సెమీ-హైస్పీడ్ రైళ్లు.. సూపర్ ఫాస్ట్, ఎక్స్ ప్రెస్, ఇంటర్ సిటీ, ప్యాసింజర్, మెము, ఎంఎంటీఎస్, లోకల్ రైళ్లు సహా రోజుకు 13,452 రైళ్లను రైల్వే శాఖ నడుపుతోంది. అయితే, వీటిలో ఒకే ఒక్క రైలు మాత్రం భారతీయ రైల్వే పాలిట కల్పవృక్షంలా మారింది.
అత్యధిక ఆదాయం దీని ద్వారా లభిస్తోంది. అది వందేభారత్, శతాబ్ది రైలు అనుకుంటే పొరబడినట్టే. రాజధాని రైలు అందులోను హజరత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) నుంచి కేఎస్ఆర్ బెంగళూరు వరకు నడిచే రాజధాని ఎక్స్ ప్రెస్ (22692) ఆదాయంలో అగ్రస్థానంలో నిలిచింది. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఈ రైల్లో 5.10 లక్షల మంది ప్రయాణించగా.. రూ.176 కోట్ల మేర ఆదాయం సమకూరింది. దీని తర్వాతి స్థానంలో పశ్చిమబెంగాల్ లోని సియాల్దా (కోల్‌కతా) నుంచి న్యూఢిల్లీ వరకు నడిచే సియాల్దా రాజధాని ఎక్స్ ప్రెస్ (12314) నిలిచింది.
గత ఆర్థిక సంవత్సరంలో 5.10 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చి.. రైల్వేకు రూ.129 కోట్ల ఆదాయాన్ని అందించింది. వీటి తర్వాతి మూడోస్థానంలో న్యూఢిల్లీ- దిబ్రూఘర్ రాజధాని ఎక్స్‌ప్రెస్ నిలిచింది. ఈ రైలు ద్వారా 4.75 లక్షల మంది ప్రయాణించి రూ.127 కోట్ల ఆదాయాన్ని రైల్వేకు అందించారు. వివిధ రాష్ట్రాల్లో ముఖ్య నగరాల నుంచి.. దేశ రాజధాని ఢిల్లీకి రాజధాని ఎక్స్‌ప్రెస్ పేరుతో రైల్వే శాఖ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడుపుతోంది. ఢిల్లీ-బెంగళూరు రాజధాని రైలు 2,367 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. మొత్తం ఏసీ బోగీలతో నడిచే ఈ రైలు ఢిల్లీకి 34 గంటల్లో చేరుకుంటుంది.
రోజూ తిరిగే ఈ రైల్లో టిక్కెట్ ధరలు ఎక్కువగా ఉంటాయి. డైనమిక్ ఫేర్ అంటే డిమాండ్ బట్టి ధర పెరుగుతుంటుంది. అలాగే, దూరం ఎక్కువ కావడం, కేవలం ఏసీ కోచ్‌లు, మిగతా వాటితో పోల్చితే ప్రయాణ సమయం తక్కువగా ఉండటంతో దీనికి డిమాండ్ ఉంటుంది. దీని వల్ల ఆదాయం దండిగా వస్తోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వేకు అత్యధిక ఆదాయం (రూ.137 కోట్లు )హజ్రత్ నిజాముద్దీన్- కేఎస్ఆర్ బెంగళూరు రాజధాని రైలు ద్వారా లభించింది. దక్షిణాది నుంచి ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలతో ఈ రైలు కలుపుతూ పరుగులు తీస్తుంది.