తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో వినియోగించే నెయ్యి కల్తీ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. దీంతో దేశంలోని అన్ని దేవాలయాల్లోనూ ప్రసాదాల తయారీపై పర్యవేక్షణ ఉండాలనే వాదన బలంగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అయోధ్య రామమందిరం ప్రసాదాలపై కీలక నిర్ణయం తీసుకుంది. బాలక్ రామ్‌కు సమర్పించే నైవేద్యాన్ని పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపింది. రామమందిరంతో పాటు యూపీలో పలు ఆలయాల్లో ప్రసాదాలను కూడా పరీక్షల కోసం పంపినట్టు అధికారులు తెలిపారు. వీటికి సంబంధించిన ఫలితాలు ఇంకా రావాల్సి ఉందని, ల్యాబ్ రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నామని చెప్పారు.
భక్తుల్లో విశ్వాసాన్ని పునరుద్ధరించే చర్యల్లో భాగంగా, స్వచ్ఛత అత్యున్నత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా వివిధ ఆలయాల నమూనాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇదిలా ఉండగా, లడ్డూ వివాదంపై అయోధ్య ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మార్కెట్‌లో విక్రయించే నెయ్యి, నూనెల స్వచ్ఛతపై సందేహాలున్నందున అన్ని ప్రముఖ ఆలయాలు ఔట్‌సోర్సింగ్ ద్వారా ప్రసాదాన్ని తయారు చేయించే ప్రక్రియపై పూర్తి నిషేధం విధించాలని ఆయన కోరారు.
‘తిరుపతి బాలాజీ లడ్డూ ప్రసాదం తయారీకీ జంతు కొవ్వులను ఉపయోగించారనే ఆరోపణలతో వివాదం నెలకుంది.. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న స్వామీజీలు, భక్తులు.. దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.. ఆలయ పూజారుల పర్యవేక్షణలోనే ప్రసాదం తయారీ జరిగేలా చూడాలి.. కేవలం అలాంటి ప్రసాదాన్నే దేవతలకు నైవేద్యంగా సమర్పించాలి.’ అని ఆచార్య సత్యేంద్ర దాస్ సూచించారు.
దేవతలకు సమర్పించే నైవేద్యాల తయారీలో మాంసం, కొవ్వులను కలపడం ద్వారా హిందూ ఆలయాల ప్రతిష్ఠను మసకబార్చేందుకు అంతర్జాతీయ స్థాయిలో కుట్ర జరుగుతోందని ఆయన అయోధ్య ప్రధాన పూజారి ఆరోపించారు. మార్కెట్‌లలో విక్రయించే నూనెలు, నెయ్యి స్వచ్ఛతను పకడ్బందీగా తనిఖీ చేయాల్సిన అవసరం ఉందని ఆయన ఉద్ఘాటించారు. తిరుపతి లడ్డూ వివాదంపై సమగ్ర దర్యాప్తు జరగాలని సాధువులు, భక్తులు కోరుకుంటున్నారని ఆచార్య సత్యేంద్ర దాస్ తెలిపారు.
విచారణ చేపట్టిన వాస్తవాలను వెలికి తీయాలని, అందుకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కాగా, ఈ ఏడాది జనవరి 22న అయోధ్య రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా తిరుపతి నుంచి లక్ష లడ్డూలను టీటీడీ పంపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం అయోధ్యలో భక్తులకు ప్రసాదంగా ఇలాచీ దానాను అందజేస్తున్నారు. ఈ ప్రసాదాన్ని ఏలకులు, పంచదార కలిపి తయారు చేస్తారు. దీని తయారీ బాధ్యతలను రామ్‌విలాస్ అండ్ సన్స్ దుకాణానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ అప్పగించిన విషయం తెలిసిందే.