టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్లారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు.. కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించారు. సీఎం అయిన తర్వాత ప్రతి శనివారం.. చంద్రబాబు కేంద్ర కార్యాలయానికి వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులను స్వీకరించడంతో పాటుగా.. కార్యకర్తలు, నేతలతో ఆయన సమావేశమవుతూ ఉంటారు. ఈ క్రమంలోనే ఈ శనివారం కూడా పార్టీ కేంద్ర కార్యాలయానికి వెళ్లిన చంద్రబాబు నాయుడు.. అందుబాటులో ఉన్న సీనియర్ నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారికి పలు సూచనలు చేశారు. వైసీపీ అసత్య ప్రచారాలపై అప్రమత్తంగా ఉండాలన్న చంద్రబాబు.. ప్రభుత్వం, పార్టీ సమన్వయంతో విపక్షం కుట్రలను తిప్పికొట్టాలన్నారు.
మరోవైపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపైనా తెలుగుదేశం పార్టీ నేతలతో చంద్రబాబు చర్చించారు. అభ్యర్థుల ఎంపికపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏపీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావును ఆదేశించారు. మరోవైపు వైసీపీ అసత్య ప్రచారాలపై స్పందించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని.. ఏదైనా సమాచారం కావాలంటే సీఎం కార్యాలయంతో మాట్లాడి తీసుకోవాలని సూచించారు. వైసీపీ దుష్ప్రచారాన్ని ఖండించటంతో పాటుగా బలంగా తిప్పికొట్టాలని నేతలకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కొంతమంది పోలీసుల తీరుపై సీఎం చంద్రబాబు వద్ద నేతలు ప్రస్తావించినట్లు సమాచారం.
మరోవైపు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయడు ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన వివిధ వర్గాల ప్రజలు, దివ్యాంగులు, విద్యార్థులతో పాటు సాయం కోసం వచ్చిన వారి నుంచి చంద్రబాబు వినతులు స్వీకరించారు. వారి బాధలను ఓపికగా విన్న చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వం తరుఫున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా గుంటూరుకు చెందిన తన్నీరు సామ్రాజ్యం అనే దివ్యాంగురాలు.. విద్యుత్ 300 యూనిట్లుకు పైగా వినియోగించామన్న కారణంతో పెన్షన్ తొలగించారని మొరపెట్టుకున్నారు. తన పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.
ఇక పల్నాడు జిల్లా, పమిడిమర్రు గ్రామానికి చెందిన గుర్రపుశాల శ్రీనివాసరావు అనే రైతు పొలాన్ని కబ్జాచేశారని ఆదుకోవాలని కోరారు. అలాగే కృష్ణ ధర్మ రక్షణ సమితికి చెందిన హిందూ పెద్దలు కూడా సీఎం చంద్రబాబును కలిశారు. గుంటూరు, విజయవాడ జాతీయ రహదారిపై గోవుల అక్రమ రవాణా జరుగుతోందని దీన్ని అరికట్టేందుకు మంగళగిరి సమీపంలో గోశాలను ఏర్పాటు చేయాలని కోరారు. అలాగే పలువురు దాతలు కూడా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు అందించారు.