లెబనాన్‌పై ఇజ్రాయేల్ దాడుల్లో హెజ్బొల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా హతమయ్యారు. బీరుట్‌లో తాము జరిపిన శక్తివంతమైన వైమానిక దాడిలో నస్రల్లా మృతిచెందినట్టు ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. దీనిని హెజ్బొల్లా ఉగ్రవాద సంస్థ కూడా ధ్రువీకరించింది. ఈ క్రమంలో లెబనాన్ సహా పశ్చిమాసియాలో తక్షణమే ఇజ్రాయేల్ దాడులు నిలిపివేసేలా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సమావేశం కావాలని ఇరాన్ కోరింది. అయితే, నస్రల్లా హత్యను సమర్దించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఇది సరైన చర్య అని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
గతేడాది గాజాపై ఇజ్రాయేల్ మొదలైన యుద్ధం ప్రారంభంలోనే నస్రల్లాను అంతం చేసే ఆపరేషన్ ప్రారంభమైందని జో బైడెన్ పేర్కొన్నారు. హెజ్బొల్లా, హమాస్ వంటి ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తోన్న ఇజ్రాయేల్‌కు అమెరికా మద్దతు కొనసాగుతుందని పునరుద్ఘాటించారు. నస్రల్లా ఆధ్వర్యంలో హెజ్బొల్లా కారణంగా వేలాది మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోయారని బైడెన్ తెలిపారు. యుద్ధ ప్రమాదాన్ని నివారించడానికి పశ్చిమాసియాలో అమెరికా సైన్యాల భద్రతను మరింత మెరుగుపరచాలని రక్షణ కార్యదర్శికి ఆదేశించినట్లు బైడెన్ చెప్పారు. మరోవైపు, బీరుట్‌లో పరిస్థితుల నేపథ్యంలో దౌత్యవేత్తల కుటుంబసభ్యులు, అమెరికా పౌరులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లాలని విదేశాంగ శాఖ కోరింది.
హెజ్బొల్లా కమాండర్‌లను హతమార్చడం వల్ల ఆ గ్రూప్‌ను అణచివేయలేరని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. నస్రల్లా మృతిపై ఆయన బహిరంగంగా సంతాపాన్ని ప్రకటించడం గమనార్హం. ఇజ్రాయేల్ చర్యలపై ఐరాస భద్రతా మండలి సమావేశం కావాలని ఆయన పిలుపునిచ్చారు. తమ దౌత్య కార్యాలయాలు, ప్రతినిధులపై ఎలాంటి దాడులకు పాల్పడినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
‘‘ఇరాన్ జాతీయ, భద్రతా ప్రయోజనాల కోసం ప్రతికార చర్య తీసుకోవడానికి అంతర్జాతీయ చట్టం ప్రకారం తన స్వాభావిక హక్కులను వినియోగించుకునే విషయంలో వెనుకాడదు’ అని ఐరాసలో ఇరాన్ రాయబారి అమీర్ సయీద్ ఇరావానీ స్పష్టం చేశారు. అటు, పాలస్తీనాకు మద్దతుగా నిలవడంతో పాటు శత్రువుపై యుద్ధం కొనసాగిస్తామని హెజ్బొల్లా ప్రకటించింది.
అటు, హెజ్‌ల్లా అధినేత షేక్ హసన్ నస్రల్లా మృతిపై ఇజ్రాయేల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు స్పందించారు. నస్రల్లాను హతమార్చడంతో ఇజ్రాయేల్ లెక్క సరిచేసిందని ఆయన పేర్కొన్నారు. నస్రల్లా హత్య ఇజ్రాయెల్‌కు ఓ చరిత్రాత్మక మలుపుగా అభివర్ణించిన ఆయన... అనేక మంది ఇజ్రాయేల్, అమెరికా, ఫ్రెంచ్ పౌరుల హత్యలకు కారణమైన హంతకుడని అన్నారు. గత రెండు వారాలుగా లెబనాన్‌లో ఇజ్రాయేల్ జరిపిన దాడుల్లో 1000 మందికిపైగా ప్రాణాలు కోల్పోగా.. వేల మంది గాయపడ్డారు.