రాయదుర్గం పట్టణంలో అర్ధంతరంగా ఆగిపోయిన రెండు రైల్వే వంతెనల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. అమరావతిలోని సచివాలయం లో సోమవారం సాయంత్రం ఆయన సీఎంను కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..... గతంలో టీడీపీ పాలన కాలంలో రాయదుర్గం పట్టణ ప్రజల భవిష్యత్తు అవసరాల దృష్ట్యా రెండు ఫ్లైఓవర్లను మంజూరు చేసిన విషయాన్ని సీఎంకు గుర్తు చేశారు. రైల్వేశాఖ వారు చేయాల్సిన పనిని ఇప్పటికే పూర్తి చేశారన్నారు. రాష్ట్ర వాటా నిధులను గత వైసీపీ ప్రభుత్వం విడుదల చేయని కారణంగా ఐదేళ్లుగా ఆ వంతెనల నిర్మాణం ఆగిపోయిందన్నారు. ప్రస్తుతం కూటమి అధికారంలో ఉన్నందువల్ల వాటి నిర్మాణాలను పూర్తి చేయాలని కోరారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలోనైనా నిధు లు మంజూరు చేసి పనులను తిరిగి ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. రాయదుర్గం-అనంతపురం రోడ్డులో నిర్మాణంలో ఉన్న వంతెనకు రూ. 44 కోట్లు, రాయదుర్గం-కణేకల్లు రోడ్డులోని వంతెన కు రూ. 35 కోట్లు నిధులు అవసరమని ఎమ్మెల్యే కాలవ ముఖ్యమంత్రికి వివరించారు.