సేవా కార్యక్రమాల్లో టీడీపీ ముందంజలో ఉంటుందని, డీజేఆర్ మెమోరియల్ ద్వారా తెలుగు యువత కృష్ణా జిల్లా అధ్యక్షుడు దండమూడి చౌదరి చేస్తున్న సేవలు అభినందనీయమని ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర కొనియాడారు. గండిగుంట లోని గణపతి సచ్చిదానంద జ్ఞాన బోధసభ ఆవరణలో సోమవారం డీజేఆర్ మెమోరియల్ దండమూడి చౌదరి ఆధ్వర్యంలో చేపట్టిన 150 కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మట్లాడూతూ, కుట్టుమిషన్ల ద్వారా మహిళల కుటుంబాలకు ఆర్థిక స్వాలంబన సాధ్యపడుతుంద న్నారు.
కుట్లు, అల్లికల ద్వారా మహిళలు స్వయం ఉపాధి పొంది కుటుంబ పోషణలో భాగస్వాములు అవడం సంతోషకరమని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ అన్నారు. సేవా కార్యక్రమాలు చేస్తున్న దండమూడి చౌదరికి రాజకీయ భవిష్యత్తు ఉంటుందని, అందుకు తనవంతు సాయం అందిస్తానన్నారు. కుట్టు మిషన్లు సద్వినియోగం చేసుకుని మహిళలు కుటుంబాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అన్నారు. ట్రస్టు ద్వారా చిరువ్యాపారులకు తోపుడు బండ్లు, బడ్డీలు అందజేసి వారి ఉపాధికి తోడ్పడడం అభినందనీ యమన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు, యెనిగళ్ల కుటుంబరావు, కార్యదర్శి కాటూరు శరత్, పార్టీ నాయకులు గుర్నాధం, జంపాన పూర్ణచంద్రరావు, పి.శ్రీనివాసరావు, బాబి, సాంబశివరావు, పలువురు కూటమి కార్యకర్తలు పాల్గొన్నారు.