అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ పెళ్లి మరోసారి వార్తల్లోకి ఎక్కింది. అయితే ఈసారి మాత్రం రాజకీయాలకు సంబంధించిన వ్యాఖ్యల్లో ఈ పెళ్లి ప్రస్తావనకు వచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీలను కలిపి కాంగ్రెస్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ.. తీవ్ర విమర్శలు చేశారు. కొడుకు పెళ్లి కోసం వేల కోట్ల రూపాయలను ముఖేష్ అంబానీ విచ్చలవిడిగా ఖర్చుచేశారని.. అయితే అదంతా దేశ ప్రజల నుంచి దోచిన సొమ్మేనని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
హర్యానా ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. ఆ రాష్ట్రంలో పర్యటించిన రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. బహదూర్‌గఢ్‌లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన రాహుల్ గాంధీ.. "అనంత్ అంబానీ పెళ్లికి ఆయన తండ్రి ముఖేష్ అంబానీ వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు కదా అది ఎవరిది?.. అదంతా మీ డబ్బు.. మీ పిల్లలకు మీరు పెళ్లిళ్లు చేయాలంటే మీ బ్యాంకు ఖాతాల్లో మాత్రం సొమ్ము లేదు. మీ పిల్లలకు పెళ్లిళ్లు చేయాలంటే మీరు బ్యాంకు లోన్లు తీసుకోవాల్సిందే. కానీ దేశంలో 25 మంది బిజినెస్‌మెన్‌లు మాత్రం వారి కుటుంబ సభ్యుల పెళ్లిళ్లు, వేడుకలు జరిపించేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసే వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ అభివృద్ధి చేశారు" అంటూ రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు గుప్పించారు.
దేశంలోని సామాన్యులు, రైతులు.. బ్యాంకుల్లో లేదా ఇతరుల దగ్గరి నుంచి అప్పులు తీసుకుంటేనే వారి కుటుంబంలోని వివాహాలు జరిపించగలుగుతున్నారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రజల జేబులో నుంచి డబ్బులు తీసుకుని.. దేశంలో ఉన్న కొందరు పారిశ్రామిక వేత్తల జేబుల్లోకి వేస్తున్నాడని తీవ్ర విమర్శలు చేశారు. దీంతో దేశంలోని రైతులు తీవ్ర అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. ప్రధాని మోదీ దేశ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టారని మండిపడ్డారు. హర్యానాలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కారణంగా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని మండిపడ్డారు. గతంలో గ్యాస్ సిలిండర్ ధర రూ. 400 ఉండగా.. ప్రస్తుతం అది రూ. 1200కి చేరిందని తెలిపారు. హర్యానా రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర రావడం లేదని పేర్కొన్న రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతుల నుంచి మద్దతు ధరకే వరి పంటను కొనుగోలు చేస్తామని భరోసా ఇచ్చారు.
ఈ క్రమంలోనే నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా రాహుల్ గాంధీ మరిన్ని విమర్శలు చేశారు. భారతదేశాన్ని రక్షిస్తున్న సైనికుల నుంచి పెన్షన్, క్యాంటీన్, అమరవీరుల హోదాను లాక్కోవడానికి అగ్నిపథ్ పథకాన్ని మోదీ తీసుకొచ్చారని ఆరోపించారు. హర్యానాలో బీజేపీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగం బాగా పెరిగిందని.. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పారు. హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. పేదలకు రూ.3.5 లక్షలతో 100 గజాల ప్లాట్.. 2 పడక గదుల ఇల్లు.. 300 యూనిట్ల ఉచిత విద్యుత్ సహా రూ.25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని మేనిఫేస్టోలో చెప్పినట్లు గుర్తు చేశారు. ఇక హర్యానాలో అక్టోబర్ 5వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా.. 8వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి.