ప్రస్తుతం ఆన్‌లైన్‌లో అన్ని వస్తువులపై పండగ ఆఫర్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలనే తమకు ఇష్టమైన వస్తువులను వివిధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి భారీగా డిస్కౌంట్లకు జనం కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ వ్యక్తి ఫ్లిప్‌కార్ట్ వెబ్‌సైట్ నుంచి ఒక ఐఫోన్ ఆర్డర్ పెట్టాడు. డబ్బులు ఆన్‌లైన్‌లో చెల్లించకుండా క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఇక ఆ ఐఫోన్ డెలివరీ కాగా.. డబ్బులు చెల్లించాలని ఫ్లిప్‌కార్ట్ డెలివరీ ఏజెంట్ అడిగాడు. అయితే ఆ డెలివరీ ఏజెంట్‌ను చంపేస్తే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని భావించిన ఆ వ్యక్తి, మరో వ్యక్తితో కలిసి అతడ్ని దారుణంగా హతమార్చారు. ఆ తర్వాత పక్కనే ఉన్న కాలువలోకి విసిరేశారు. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో చోటు చేసుకుంది.
ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లక్నోలో ఈ సంఘటన సెప్టెంబర్ 23వ తేదీన చోటు చేసుకుంది. నిషాత్‌గంజ్ ప్రాంతంలో నివసించే 30 ఏళ్ల బాయ్ భరత్ సాహు ఫ్లిప్‌కార్ట్ డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే రోజూలాగే గత నెల 23వ తేదీన కూడా ఆర్డర్లు డెలివరీ చేయడానికి వెళ్లాడు. ఇక ఫ్లిప్‌కార్ట్ ద్వారా యాపిల్ కంపెనీకి చెందిన రూ.1.5 లక్షల విలువైన ఐఫోన్‌ను గజానన్ అనే వ్యక్తి బుక్ చేశాడు. దానికి క్యాష్ ఆన్ డెలివరీ విధానంలో ఆర్డర్ చేశాడు. ఇక ఆ ఐఫోన్‌ను గజానన్‌కు డెలివరీ చేసేందుకు భరత్ సాహు వెళ్లాడు. ఈ క్రమంలోనే భరత్ సాహు తెచ్చిన ఐఫోన్ తీసుకున్న గజానన్.. మరో వ్యక్తితో కలిసి అతడ్ని దారుణంగా చంపేశారు.
ఇక భరత్ సాహు రెండు రోజులుగా ఇంటికి రావడం లేదని అతడి కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 25వ తేదీన స్థానికంగా ఉన్న చిన్హట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే వారి విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. ఐఫోన్ డెలివరీకి వెళ్లిన సమయంలో గజానన్, అతడి స్నేహితుడు ఇద్దరూ కలిసి భరత్ సాహును గొంతు కోసి హత్య చేసినట్లు లక్నో డిప్యూటీ కమిషనర్ శశాంక్ సింగ్ వెల్లడించారు. ఆ తర్వాత అతని మృతదేహాన్ని ఇందిరా కాలువలో పడేసినట్లు చెప్పారు.
మొదట మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. భరత్ సాహు కోసం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే భరత్ సాహు కాల్ రికార్డులు, అతడు చివరి సారిగా వెళ్లిన లొకేషన్‌ను గుర్తించారు. దీంతో చివరగా గజానన్‌కు ఫోన్ చేసినట్లు గుర్తించారు. అతడి ద్వారా అతని స్నేహితుడు ఆకాష్ గురించి పోలీసులకు సమాచారం అందగా.. ఆకాష్‌ను ప్రశ్నించగా.. చేసిన నేరం ఒప్పుకుని విషయాన్ని వెల్లడించారు. భరత్ సాహును చంపేసి.. తర్వాత మృతదేహాన్ని గోనెసంచిలో పెట్టి ఇందిరా కాలువలో పడేసినట్టు చెప్పాడు. దీంతో ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించి భరత్ సాహు మృతదేహం కోసం గాలింపు చేపట్టారు.