ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజా భద్రతే ముఖ్యం.. అది గుడా.. దర్గా అని చూడొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

national |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 11:25 PM

అక్రమ కట్టడాల కూల్చివేతలపై సర్వోన్నత న్యాయస్థానం కీలక ఆదేశాలు ఇచ్చింది. ప్రజా భద్రతే ముఖ్యమని, రహదారి, చెరువులు లేదా రైల్వే ట్రాక్‌లను ఆక్రమించి నిర్మించిన ఏ అక్రమ కట్టడాన్నైనా మతాలతో సంబంధం లేకుండా కూల్చివేయాలని జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథ్‌లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశించింది. భారత్ లౌకిక దేశమని, మతంతో సంబంధం లేకుండా పౌరులందరికీ బుల్డోజర్ చర్యలు, ఆక్రమణల కూల్చివేతల ఆదేశాలు వర్తిస్తాయని ధర్మాసనం నొక్కి చెప్పింది. బుల్డోజర్ కూల్చివేతలను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌పై మంగళవారం నాటి విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.


అనేక రాష్ట్రాల్లో ప్రస్తుతం బుల్డోజర్ కూల్చేవేత ట్రెండ్ నడుస్తోంది. అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చివేస్తున్నట్టు అధికారులు ఈ చర్యలను సమర్థించుకుంటున్నారు. కాగా, ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్ ప్రభుత్వాల తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉండటం వల్లే బుల్డోజర్ చర్యను ఎదుర్కోవడానికి కారణమవుతుందా? అని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి మెహతా ఇలా సమాధానమిస్తూ.. ‘ఖచ్చితంగా కాదు అత్యాచారం లేదా ఉగ్రవాదం వంటి ఘోరమైన నేరాలకు పాల్పడినా అలాంటి చర్యలు తీసుకోరు..’ అని అన్నారు. అయితే, కూల్చివేతల విషయంలో పంచాయతీలు, మున్సిపాల్టీల చట్టాలకు వ్యత్యాసం ఉందని, వీటిని ఆన్‌లైన్‌లో ఉంచితే ప్రజలకు అవగాహన వస్తుందని ధర్మాసనం పేర్కొంది.


ఈ సమయంలో సొలిసిటర్ జనరల్ మాట్లాడుతూ.. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారని ఆరోపిస్తూ కొన్ని సందర్భాల్లో కోర్టు ఆదేశాలు జారీ చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ.. ‘మనది లౌకిక దేశం.. ఆక్రమణల విషయంలో మతం లేదా వర్గాలకు అతీతంగా మా ఆదేశాలు ఉంటాయి. వాస్తవానికి రహదారి, ఫుట్‌పాత్, చెరువులు లేదా రైల్వే లైన్ అయితే ప్రజా భద్రత ముఖ్యం.. ఏదైనా మతపరమైన నిర్మాణం గురుద్వారా లేదా దర్గా లేదా ఆలయం ఉంటే అది ప్రజలకు ఆటంకం కలిగించరాదు’ అని స్పష్టం చేసింది.. అనధికార నిర్మాణాలపై ఒక చట్టం ఉండాలి, అది మతం లేదా విశ్వాసం లేదా నమ్మకంపై ఆధారపడి ఉండదని జస్టిస్ గవాయ్ అన్నారు.


అయితే, కూల్చివేతలకు నేరారోపణలు ఆధారం కాకూడదని, పౌర నిబంధనలను ఉల్లంఘించిన కేసుల్లో మాత్రమే ముందుకెళ్లాలని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు అనుమతి లేకుండా కూల్చివేతలపై గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించింది. కాగా, యూపీలో క్రిమినల్స్‌కు యోగి సర్కారు బుల్డోజర్ల ట్రీట్మెంట్ తీవ్ర రాజకీయ దుమారానికి కారణమైన విషయం తెలిసిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com