దేశంలో బాల్య వివాహాలను నిరోధించే చట్టాన్ని బ్రిటిష్ హయాంలోనే తీసుకొచ్చినా.. ఇప్పటికీ కొన్ని చోట్ల ఈ దురాచారం ఇంకా ఉంది. సమాజంలో ఎన్నో మార్పులు వచ్చి.. చైతన్యం తీసుకువస్తున్నా.. బాల్య వివాహాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా, రాజస్థాన్‌లో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. తనకు ఊహ తేలిసేనాటికి పెళ్లైపోయిందని తెలిసిన ఆమె.. తనకు జరిగిన అన్యాయంపై పోరాటం చేసి విజయం సాధించింది. కోర్టు ఆ వివాహాన్ని రద్దు చేయడమే కాదు.. న్యాయపోరాటానికైన మొత్తం ఖర్చులను అత్తింటివారే భరించాలని ఆదేశించింది.
వివరాల్లోకి వెళ్తే.. జోధ్‌పూర్‌కు చెందిన అనిత (21)కు నాలుగు నెలల వయసులోనే తల్లిదండ్రులు వివాహాం చేశారు. దీంతో ఆమెకు 15 ఏళ్లు వచ్చేసరికి కాపురానికి పంపాలని అత్తమామలు ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ, పొత్తిళ్లలో ఉన్నప్పుడు జరిగింది పెళ్లి కాదని, తాను కాపురానికి రాబోనని ససేమిరా అంది అనిత. బాల్య వివాహానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటానికి మొదలుపెట్టింది. ఈ విషయంలో ఆమెకు సోదరి, సోదరుడి అండగా నిలిచారు. స్వచ్ఛంద సంస్థ సారథి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ డాక్టర్ కృతి భారతి సహకారంతో బాల్య వివాహాంపై పోరాడి గెలిచింది.
సోమవారం జోధ్‌పూర్ కుటుంబ న్యాయస్థానం జడ్జి వరుణ్ తల్వార్ బాల్య వివాహన్ని రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు. ఆమెకు అనుకూలంగా ఆదేశాలు ఇచ్చిన న్యాయమూర్తి.. కోర్టు వ్యాజ్యం ఖర్చులను చెల్లించాలని అత్త,మామలను ఆదేశించారు. ఓవైపు బాల్య వివాహాలపై ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా.. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బాల్య వివాహాల కట్టడికి అవసరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. బాల్య వివాహాలు దుర్మార్గం మాత్రమే కాదని, తీవ్రమైన నేరమని జడ్జి తల్వార్ పేర్కొన్నారు.
చిన్న వయసులో వివాహాలు పిల్లల బంగారు భవిష్యత్తును నాశనం చేస్తాయని అన్నారు. అమ్మాయి లేదా అబ్బాయి బాల్య వివాహాలను కొనసాగించకూడదనుకుంటే, వాటిని రద్దు చేసే హక్కు వారికి ఉందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సమాజం సహకారం అవసరమని చెప్పారు. కాగా, అనిత నిర్ణయాన్ని మొదట్లో ఆమె తల్లిదండ్రులు వ్యతిరేకించినా.. కృతి భారతి కౌన్సెలింగ్‌తో కుమార్తెకు మద్దతుగా నిలిచారు.
కోర్టు నిర్ణయంపై అనిత స్పందిస్తూ.. ‘ఇప్పుడు తనకు మెరుగైన పునరావాస ప్రయత్నాలు జరుగుతున్నాయి... బాల్య వివాహాలు చరిత్ర పుస్తకాల్లో నిలిచిపోయేలా చూడటమే నా ప్రచార లక్ష్యం.. దీదీ కృతి భారతి సహాకారంతో నేను బాల్య వివాహం ఉచ్చు నుంచి బయటపడగలిగాను.. నా కాళ్లపై నేను నిలబడి.. నా కలలను నిజం చేసుకుంటాను’ అని ఆమె అన్నారు.