రాష్ట్రంలో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఇక నుంచి డ్రోన్ కెమెరాల ద్వారా చెత్త ఎక్కడ ఉందో గుర్తిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఎవరూ రోడ్డుపై చెత్తవేయొద్దని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందని ముఖ్యమంత్రి సూచించారు. ఇటీవల కాలంలో గ్యాస్ ధరలు పెరిగినా ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినవిధంగా దీపావళి పండుగ నుంచి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇచ్చే పథకాన్ని ప్రారంభించనున్నామని తెలిపారు.
2025 మార్చి నుంచి రాష్ట్రవ్యాప్తంగా మరుగుదొడ్లు లేని వారిందరికీ మరుగుదొడ్లు కట్టిస్తామని తెలిపారు. 2027 నాటికి ఇంటింటికీ కుళాయి కనెక్షన్లు పూర్తిచేస్తామన్నారు. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం 45 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 45 శాతం ఇవ్వగా, మిగిలిన 10 శాతం స్థానిక సంస్థలు ఖర్చుపెట్టుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తాను చర్చించుకుని ఇంటింటికీ కుళాయి పథకాన్ని కచ్చితంగా పూర్తిచేయాలని నిర్ణయించామని తెలిపారు.