టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో మాజీ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ పిటీషన్‌పై ఈరోజు (శుక్రవారం) హైకోర్టులో విచారణ జరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఘటన జరిగిన రోజున సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నారని.. ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో ఉందని పోలీసుల తరపు న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.
ఆయన ఆధ్వర్యంలోనే ఈ దాడి జరిగిందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్దార్ధ్ లూథ్రా తెలిపారు. అయితే ఘటన జరిగిన రోజు సజ్జల 600 కిలోమీటర్ల దూరంలో ఉన్నారని సజ్జల తరపున న్యాయవాదులు న్యాయస్థానానికి తెలియజేశారు. ఆ రోజున పోరుమామిళ్లల్లో ఉన్నారని, అక్కడ మీడియాలో వచ్చిన క్లిప్పింగ్‌లను కోర్టుకు చూపించారు. ఈ క్రమంలో తాము ఈ కేసులో నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను మరోసారి పరిశీలిస్తామని సిద్దార్థ లూథ్రా చెప్పారు. దీంతో కేసు విచారణ హైకోర్టు ఈనెల 25కు వాయిదా వేసింది.