తిరుమల లడ్డు వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్లు ఏపీ గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని మంత్రి కొల్లు అన్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని తెలిపారు. వినాయకుడి గుడి వద్ద నంచి క్యూ లైన్‌లో నడిచి తాను కొండపైకి చేరినట్లు మంత్రి చెప్పారు.
గత ఐదేళ్లపాటు మహోత్సవాలను వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని రవీంద్ర మండిపడ్డారు. ఎన్డీయే ప్రభుత్వం దేవాలయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని, అందుకే ఉత్సవాలను ఇంత ఘనంగా నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. లక్షల మంది భక్తులు వస్తున్నా ఎలాంటి ఆటంకం లేకుండా అమ్మవారి దర్శనం జరుగుతోందని మంత్రి చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు కొల్లు రవీంద్ర చెప్పుకొచ్చారు.