ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడు మాజీ సీఎం, దిగ్గజ నటుడు ఎంజీఆర్‌పై తాజాగా ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఏఐఏడీఎంకే పార్టీ ఏర్పాటై ఈ నెల 17తో 53ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీఆర్ అభిమానులకు జనసేనాని శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఎంజీఆర్‌పై ప్రశంసలు కురిపించారు. చిన్నప్పుడు చెన్నైలో ఉన్న సమయంలోనే 'పురచ్చి తలైవర్', తిరు 'ఎంజీఆర్' పట్ల నాకున్న ప్రేమ, అభిమానం అంతర్భాగంగా ఉంది. ఇంకా అది ఇప్పటికీ చెక్కుచెదరకుండా అలాగే ఉంది. రాబోయే ఏఐఏడీఎంకే 53వ ఆవిర్భావ దినోత్సవం (అక్టోబర్ 17న) సందర్భంగా 'పురచ్చి తలైవర్' ఆరాధకులు, అభిమానులందరికీ నా శుభాకాంక్షలు. పురచ్చి తలైవర్‌తో నాకు మొదటి పరిచయం మైలాపూర్‌లో చదువుతున్నప్పుడు మా తమిళ భాషా ఉపాధ్యాయుడి ద్వారా ఏర్పడింది. పరోపకారం, దయాగుణం, నిష్కపటత్వం, తన ప్రజల పట్ల శ్రద్ధ ఈ నాలుగు విషయాలను కలిగి ఉన్న రాజుల వెలుగొందారు" అని పవన్ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. కాగా, ఈ ట్వీట్ పవన్‌ను వ్యతిరేకిస్తున్న తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వానికి చెక్ పెట్టేలా, ఏఐఏడీఎంకేకి దగ్గరయ్యేలా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సనాతన ధర్మం విషయంలో డీఎంకే నేత, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను తిరుమలలో నిర్వహించిన వారాహి డిక్లరేషన్ సభలో పవన్ తిప్పికొట్టిన విషయం తెలిసిందే. దాంతో జనసేనాని లక్ష్యంగా డీఎంకే పార్టీ సోషల్ మీడియా వింగ్ పాత వీడియోలను పోస్ట్ చేస్తూ ట్రోల్ చేయడం మొదలెట్టింది. అంతటితో ఆగకుండా ఉదయనిధి అనుచరులు ఈ వివాదంలోకి చిరంజీవిని లాగారు. 'మీ సోదరుడిని ఎమోషన్స్‌ను కంట్రోల్ చేసుకోమని చెప్పండి' అంటూ చిరును ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దానికి కౌంటర్‌గానే పవన్ కల్యాణ్ ఇప్పుడీ ట్వీట్ చేసి ఉంటారని తెలుస్తోంది. ఇప్పుడు డీఎంకే వారు జనసేనానిని ఏం చెప్పిన జనసేనతో పాటు ఏఐఏడీఎంకే వారు కూడా పవన్‌కు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది.