విజయనగరం జిల్లా, జియ్యమ్మవలస మండలంలో 2019లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితునికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.20 వేల జరిమానా విధిస్తూ సీనియర్ సివిల్ న్యాయాధికారి ఎస్.అరుణ తీర్పునిచ్చారు. ఎస్పీ మాధవరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం పెదమేరంగి గ్రామానికి చెందిన పల్లా దుర్గారావును అదే గ్రామానికి చెందిన బంటు లోకనాథం అలియాస్ నాని పాతకక్షల కారణంగా గాయపర్చాడని ఫిర్యాదు చేశారు.
ఈ మేరకు చినమేరంగి పోలీస్ స్టేషన్‌లో ఎస్‌ఐ శివప్రసాద్ కేసు నమోదు చేశారు. దీనిని అప్పటి ఎల్విన్‌పేట సీఐ డీవీజే రమేష్ కుమార్ దర్యాప్తు నిర్వహించి నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు హాజరుపర్చారు. నిందితుడిపై నేరారోపణ రుజువు కావడంతో అతనికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ న్యాయాధికారి ఎస్.అరుణ శుక్రవారం తీర్పు వెలువరించారని ఎస్పీ మాధవరెడ్డి తెలిపారు. ఈ కేసులో స్పెషల్ పీపీ గొర్లె వెంకటరమణ వాదనలు వినిపించారు. దర్యాప్తు అధికారి డీవీజే రమేష్ కుమార్, ఎస్‌ఐ శివప్రసాద్, సిబ్బందికి ఎస్పీ అభినందనలు తెలిపారు.