ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం విడుదల చేసిన విషయం తెలిసిందే. రెండేళ్ల కాలపరిమితి ముగియడంతో గత ప్రభుత్వ హయాంలోని మద్యం షాపులను రద్దు చేసిన సర్కార్.. కొత్త మద్యం షాపుల కోసం టెండర్లను పిలిచింది. ఈ మేరకు నూతన మద్యం షాపుల కోసం గత వారం నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే ఏపీలో మద్యం షాపులకు టెండర్లు మందకొడిగా దాఖలవుతున్నాయి. ఆరు రోజుల వ్యవధిలో 3396 షాపులకు గానూ కేవలం 8274 టెండర్లే దాఖలయ్యాయి. స్టేట్ యావరేజ్ లెక్కల ప్రకారం ఒక్కో మద్యం షాపునకు 2-3 టెండర్లు మాత్రమే వచ్చాయని ఏపీ ఎక్సైజ్ శాఖ వెల్లడించింది. భారీ ఎత్తున సిండికేట్లు ఏర్పడడంతో ప్రభుత్వ అంచనాలకంటే తక్కువగా మద్యం టెండర్లు దాఖలవుతున్న పరిస్థితి.
మరో మూడు రోజుల్లో టెండర్ల దాఖలు గడవు ముగియనుంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 855 టెండర్లు దాఖలవగా... అత్యల్పంగా మన్యం జిల్లాలో కేవలం 174 టెండర్లే దాఖలయ్యాయి. తిరుపతి, నెల్లూరు జిల్లాలో మద్యం టెండర్లల్లో సీన్‌ను బిడ్డర్లు రివర్స్ చేస్తున్నారు. తిరుపతి జిల్లాలో 227 షాపులకు గానూ కేవలం 165 టెండర్లు మాత్రమే బిడ్డర్లు దాఖలు చేశారు. అలాగే నెల్లూరు జిల్లాలో 182 షాపులకు 179 టెండర్లు మాత్రమే దాఖలయ్యాయి. తిరుపతి,నెల్లూరు జిల్లాల్లో కొన్ని షాపులకు టెండర్లు వేసేందుకే బిడ్డర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. ఎన్టీఆర్, విజయనగరం జిల్లాల్లో ఒక్కో మద్యం షాపునకు యావరేజీన 5-6 టెండర్లు, ఏలూరు జిల్లాలో 4-5 టెండర్లు దాఖలైనట్లు సమాచారం.