శ్రీసత్యసాయి జిల్లా కదిరిలో ఓ మహిళ పసికందును బస్టాండ్‌లో వదిలి పారిపోయిన ఘటన కలకలం రేపింది. గుర్తు తెలియని మహిళ చిన్నారితో పాటు ఆర్టీసీ బస్టాండ్‌కు వచ్చింది.. అక్కడ కొద్దిసేపు కలియతిరిగింది. ఆ తర్వాత వాష్‌రూమ్‌కు వెళ్లొస్తానని.. పసికందును కొద్దిసేపు చూసుకోమని చెప్పి ఓ విద్యార్థినికి అప్పగించింది. ఆమె మెల్లిగా అక్కడి నుంచి వెళ్లిపోయింది. చిన్నారి తల్లి ఎంతసేపటికీ రాకపోవడంతో.. ఆ విద్యార్థిని డయల్ 100కు ఫోన్ చేసి సమాచారం అందించింది.
వెంటనే పోలీసులు కదిరి బస్టాండ్‌కు వెళ్లి మహిళ వివరాలు తెలుసుకుని ఆచూకీ కోసం గాలించారు. ఆమె ఆచూకీ తెలియకపోవటంతో ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించి చిన్నారిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. అక్కడి నుంచి పసికందు ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మహిళ ఆచూకీ కనిపెట్టేందుకు బస్టాండ్‌లోని సీసీ ఫుటేజీని సేకరించారు. బాలికను తీసుకొచ్చిన మహిళ ఉన్న కొద్దిసేపూ కంగారుపడుతూ ఉన్నట్లు గుర్తించామని చెబుతున్నారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆమెను గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
శ్రీసత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లేపాక్షిలోని బ్రహ్మకుమారీ ఆశ్రమంలో ఉంటున్న 8 మంది సభ్యులు ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు కారులో మడకశిర వెళ్లి తిరిగొస్తున్నారు. మార్గ మధ్యలో చోళసముద్రం హైవే కూడలికి దగ్గరలో రోడ్డు కుంగడంతో వేగాన్ని అదుపు చేయలేక కారు డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో కారులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలయ్యాయి.. వీరిని వెంటనే హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే సరస్వతమ్మ, నారాయణమ్మలు చనిపోయారు. మిగిలిన ఆరుగురిలో లక్ష్మమ్మకు స్థానికంగా వైద్యం అందిస్తున్నారు. మరికొందర్ని మెరుగైన వైద్యం కోసం అనంతపురం, బెంగళూరు ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదంలో తీవ్రగా గాయపడిన వారిని స్థానిక టీడీపీ నేతలు పరామర్శించారు. మెరుగైన వైద్యం అందేలా చూడాలని స్థానికంగా వారు డాక్టర్లను కోరారు.