కడప రాజకీయాలు అనగానే ఠక్కున నియోజకవర్గాలు... పులివెందుల, జమ్మలమడుగు. మరీ ముఖ్యంగా జమ్మలమడుగు నియోజకవర్గం అత్యంత సమస్యాత్మక నియోజకవర్గంగా పేరొందింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఫ్యాక్షన్ రాజకీయాలు పరిస్థితిని ఇలా మార్చేశాయ్. తాజాగా జమ్మలమడుగు నియోజకవర్గం మరోసారి వార్తల్లో నిలిచింది. జమ్మలమడుగు ఎమ్మెల్యే, బీజేపీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణం. స్థానిక వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టే క్రమంలో ఆదినారాయణ రెడ్డి సంయమనం కోల్పోయారు. తనను ఏమైనా అంటే చెప్పుతో కొడతా అంటూ ఆవేశానికి లోనయ్యారు. అసలు సంగతిలోకి వస్తే..
జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ తరుఫున పోటీ చేసి ఆదినారాయణ రెడ్డి గెలుపొందారు. అయితే ఎన్నికల్లో గెలిచి ఇన్నిరోజులైనా టీడీపీ కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయడం లేదని స్థానిక వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని.. సూపర్ సిక్స్ కోసం ఐదేళ్లపాటు ఎదురుచూడాల్సిందేనంటూ వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదినారాయణ రెడ్డిపైనా విమర్శలు చేశారు. ఆదినారాయణ రెడ్డి, రామసుబ్బారెడ్డి కుటుంబాల మధ్య ఏళ్లుగా వైరం నడుస్తోంది. తాజాగా విమర్శలు సైతం శ్రుతిమించడంతో.. ఆదినారాయణ రెడ్డి రియాక్టయ్యారు. తను గురించి ఇష్టానుసారం మాట్లాడితే చెప్పుతో కొడతా.. మూతి పగులుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. ఫుట్ బాల్ ఆడతా.. సిక్సర్ కొడతానే ఉంటానంటూ వైసీపీ నేతలకు వార్ని్ంగ్ ఇచ్చారు.
మరోవైపు టీడీపీ కూటమి హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను సంక్రాంతి నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని ఆదినారాయణ రెడ్డి తెలిపారు. జమ్మలమడుగులోనూ సూపర్ లెవల్లో పథకాలను అమలు చేస్తామన్నారు. స్థానికంగా ఉండే వైసీపీ నేతలకు ఫీల్డింగ్, బౌలింగ్ రావటం లేదన్న ఆదినారాయణ రెడ్డి.. వైఎస్ జగన్‌కు దమ్ముంటే జమ్మలమడుగులో తనపై పోటీచేయాలని ఛాలెంజ్ చేశారు. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదని స్థానిక వైసీపీ నేతలు రామసుబ్బారెడ్డి, సుధీర్‌రెడ్డిలను హెచ్చరించారు. ప్రభుత్వ స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేశారని, దొంగ రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారన్న ఆదినారాయణ రెడ్డి.. అవన్నీ బయటకు తీస్తామన్నారు. వచ్చే సంక్రాంతి నాటికి రాజోలి జలాశయ నిర్మాణం, గండికోట ముంపు పరిహారం, టిడ్కో ఇళ్ల పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆదినారాయణ రెడ్డి తెలిపారు.