ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు వాలంటీర్ల భవిష్యత్ ఏంటి?.. అసలు ఈ వ్యవస్థ కొనసాగుతుందా?.. కొద్దిరోజులుగా ఈ అంశంపై గందరగోళం నడుస్తోంది. వాలంటీర్ల వ్యవస్థపై ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం పదే, పదే చెబుతున్నా.. ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ కొనసాగింపుపై ఓ క్లారిటీకి వచ్చినట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ నెల 10న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ భేటీ జరగనుంది. అయితే ఈ మంత్రివర్గ సమావేశంలో వాలంటీర్ల అంశంపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. వాలంటీర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడంతో పాటుగా వారికి రూ.10వేలు గౌరవ వేతనం ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. అంతేకాదు వాలంటీర్లకు నాలుగు నెలలుగా జీతం కూడా ఒకేసారి అందించేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.. కాకపోతే ప్రభుత్వం వాలంటీర్ల అంశంపై అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. గతంలో ఏపీ కేబినెట్ భేటీ జరిగిన సందర్భాల్లో.. వాలంటీర్ల వ్యవస్థపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే చర్చ జరిగింది.. కానీ ఆ దిశగా అడుగులు పడలేదు. మరి ఈసారైనా కేబినెట్ భేటీలో క్లారిటీ ఇస్తారా?.. లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది.
గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి గ్రామం, వార్డు పరిధిలో 50 ఇళ్లకు ఒక వాలంటీర్‌ను నియమించారు. ప్రతి నెలా పింఛన్ అందించడంతో పాటుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించిన విధుల్ని నిర్వహించేవారు. అయితే 2024 మార్చిలో ఎన్నికల షెడ్యూల్ రాగానే.. వాలంటీర్లకు చెక్ పడింది. కేంద్ర ఎన్నికల సంఘం వాలంటీర్లను వారి విధులకు దూరంగా ఉంచింది.. వారి దగ్గర ఉండే మొబైల్స్ వెనక్కు తీసుకున్నారు. ఈ క్రమంలో కొంతమంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
ఎన్నికల సమయంలో వాలంటీర్ల అంశంపై కూటమి స్పందించింది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా వాలంటీర్ల వ్యవస్థను కొనసాగిస్తామని.. గౌరవ వేతనాన్ని రూ.10వేలకు పెంచుతామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వాలంటీర్లు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు. వాలంటీర్ల అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సహా మంత్రులు పలు సందర్బాల్లో స్పందించారు. వాలంటీర్ల వ్యవస్థపై ప్రభుత్వ త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటుందని.. వారి సేవల్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచన చేస్తున్నామన్నారు. అయితే నాలుగు నెలలవుతున్నా వాలంటీర్ల అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మరి ఈ కేబినెట్ సమావేశంలోనైనా నిర్ణయం తీసుకుంటారా?.. లేదా? అన్నది చూడాలి.