కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన ఇసుక విధానంలో స్పష్టత లేదంటూ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ పెదవి విరిచారు. ఇసుక పాలసీలో పారదర్శకత లోపించిందని విమర్శించారు. నాలుగు నెలలవుతున్నా, ఇసుకపై సరైన విధానమంటూ లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓవైపు ఉచిత ఇసుక అని ప్రచారం చేసుకుంటూనే, మరోవైపు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి పార్టీల నేతలు మాత్రం ఇసుకను యధేచ్ఛగా దోచుకుంటున్నారని బొత్స ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 117 రోజులు గడుస్తున్నా, భవన నిర్మాణ కార్మికులకు పనుల్లేవని, ఇసుకపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.