హర్యానా రాజకీయ చరిత్రలో వరుసగా మూడోసారి ఏ పార్టీ అధికారంలోకి రాదు అనే సంప్రదాయాన్ని బీజేపీ బద్ధలు కొట్టింది. 2014, 2019లో గెలిచి హ్యాట్రిక్‌పై గురి పెట్టిన కమలం పార్టీ.. 2024లో కూడా విజయం సాధించి హర్యానా చరిత్రలోనే కొత్త చరిత్రను లిఖించింది. ఇక హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలను తారుమారు చేస్తూ.. బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుని హ్యాట్రిక్ కొట్టింది. దీంతో బీజేపీ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. 10 ఏళ్లు అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యతిరేకత, జవాన్, పహిల్వాన్, కిసాన్ ఆందోళనలను కాదని అక్కడి ప్రజలు మళ్లీ కాషాయ పార్టీకే పట్టం కట్టాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత నాయబ్ సింగ్ సైనీకే మరోసారి బాధ్యతలు కట్టబెట్టాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్‌ను బీజేపీ దాటిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆ రాష్ట్రంలో మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం దాదాపు ఖాయం అయింది. దీంతో మరోసారి ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ వైపే మొగ్గు చూపుతున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇప్పటివరకు జరిగిన లెక్కింపు, వెలువడిన ఫలితాల్లో బీజేపీ మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసింది. 49 చోట్ల బీజేపీ జయకేతనం ఎగురవేయగా.. కాంగ్రెస్ పార్టీ 36 స్థానాలకు మాత్రమే పరిమితం అయింది.
ఇక హర్యానాలో బీజేపీ గెలుపొందడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ సైనీకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ఇక మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత కేంద్రమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు నాయబ్ సింగ్ సైనీ అత్యంత సన్నిహితుడు కాగా.. ఓబీసీ వర్గానికి చెందినవారు. 1996లో బీజేపీలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన నాయబ్ సింగ్ సైనీ.. ఆ పార్టీలో ఎన్నో పదవులను చేపట్టారు. 2014లో నారాయణ్‌గఢ్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టిన సైనీ.. 2016లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇక గతేడాది అక్టోబరులో బీజేపీ హర్యానా అధ్యక్షుడిగా నియమితులైన సైనీ.. ఆ తర్వాత సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.
ఇక హర్యానా ప్రజలు ఇప్పటివరకు ఒక్కసారి కూడా వరుసగా మూడోసారి ఏ పార్టీకి పట్టం కట్టిన దాఖలాలు లేవు. గరిష్టంగా 2 సార్లు మాత్రమే ఒక పార్టీకి అధికారాన్ని ఇచ్చారు. 1968, 1972లో కాంగ్రెస్ పార్టీని వరుసగా రెండుసార్లు గెలిపించగా.. ఆ తర్వాత 2005, 2009లో కూడా మళ్లీ హస్తం పార్టీకి జైకొట్టారు. ఇక ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ తొలిసారి గెలిచిన 2014.. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో హర్యానా వాసులు వరుసగా బీజేపీకి అధికారం అందించారు. అయితే ఈసారి మాత్రం హర్యానా ప్రజలు బీజేపీకి వరుసగా మూడుసార్లు పట్టం కట్టి.. గత చరిత్రను చెరిపేశారు.