హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. హర్యానా ప్రజలు హృదయపూర్వకంగా తమను ఆశీర్వదించారని హర్షం వ్యక్తం చేశారు. బీజేపీకి మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇచ్చిన హర్యానా ప్రజలకు సెల్యూట్ చేస్తున్నానని తెలిపారు. ఇది సుపరిపాలన, అభివృద్ధి రాజకీయాలకు దక్కిన విజయం అని అభివర్ణించారు. హర్యానా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు బీజేపీ ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని హామీ ఇస్తున్నానని మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలందరికీ హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. ఈ ఘనవిజయం కోసం బీజేపీ శ్రేణులు అవిశ్రాంతంగా పనిచేశాయని కొనియాడారు. ప్రజలకు మంచి పాలన అందించడమే కాకుండా, అభివృద్ధి అజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లారని ప్రశంసించారు. ఇక, జమ్మూ కశ్మీర్ లో బీజేపీ సాధించిన ఫలితాల పట్ల గర్విస్తున్నానని ప్రధాని మోదీ వెల్లడించారు. "బీజేపీకి ఓటు వేయడంపై ద్వారా మాపై నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. జమ్మూ కశ్మీర్ ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతూనే ఉంటామని మాటిస్తున్నాను. ఈ సందర్భంగా తీవ్రంగా శ్రమించిన మా కార్యకర్తలను అభినందిస్తున్నాను. ఏదేమైనా జమ్మూ కశ్మీర్ లో జరిగిన ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకమైనవి. ఆర్టికల్ 370, 35(ఏ) తొలగింపు తర్వాత జరిగిన మొదటి ఎన్నికలు ఇవి. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉందని చాటుతూ ప్రజలు భారీగా పోలింగ్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జమ్మూ కశ్మీర్ లోని ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నాను" అంటూ మోదీ పేర్కొన్నారు