వరుసగా రెండు పర్యాయాలు హరియాణాను పాలించిన బీజేపీ పట్ల సాధారణంగానే అక్కడ కొంత ప్రభుత్వ వ్యతిరేకత వ్యక్తం అయింది. దీనికి తోడు నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 సాగు చట్టాలు, రైతుల ఉద్యమం, పెరిగిపోతున్న నిరుద్యోగం, బీజేపీకి జాట్లు దూరం కావడం, రెజ్లర్ల ఆందోళనతో.. హరియాణాలోని బీజేపీ ప్రభుత్వంపై ప్రజల్లో, వివిధ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. అవన్నీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో గెలుపుపై కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి. దీనికి తోడు మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనా సంస్థలు కూడా ఈసారి అధికార మార్పు ఖాయమేనని.. కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజార్టీతో హరియాణాలో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని అంచనా వేశాయి. అయితే చివరికి మాత్రం పరిస్థితి మారిపోయింది. దీనికి ప్రధాన కారణం అహిర్వాల్ బెల్ట్.
దక్షిణ హరియాణాలోని ప్రాంతమే ఈ అహిర్వాల్ బెల్ట్. హరియాణాలో బీజేపీకి గట్టి ఓటు బ్యాంకుగా ఉన్న జాట్లు క్రమంగా దూరం అవడం ఆ పార్టీకి బిగ్ షాక్‌గా మారింది. అయితే 2014, 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హరియాణాలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఈ అహిర్వాల్ బెల్ట్ ఎంతో ఉపయోగపడింది. గుర్గావ్, రేవారి, మహేందర్‌గర్ ప్రాంతాల్లో విస్తరించి ఉన్న అహిర్వాల్ రీజియన్ 2014 నుంచి బీజేపీకి కంచుకోటగా ఉంది. ఇక ఈ ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఈ అహిర్వాల్ బెల్ట్‌లో బీజేపీ మెరుగైన ఫలితాలు రాబట్టినట్లు రిజల్ట్స్ చెబుతున్నాయి.
ఇక ఈ అహిర్వాల్ బెల్ట్‌లో బీజేపీకి బలమైన నేతగా గుర్గావ్ ఎంపీ, కేంద్రమంత్రి రావ్ ఇంద్రజీత్ సింగ్ ఉన్నారు. ఈ ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో గురుగ్రామ్ నుంచి ఎంపీగా గెలిచిన రావ్ ఇంద్రజీత్ సింగ్.. మొత్తం 6 సార్లు విజయం సాధించారు. అంతేకాకుండా అహిర్వాల్ బెల్ట్‌లో ఆయన నేతృత్వంలో బీజేపీకి గట్టి పట్టు ఉంది. ఇక ఈ అహిర్వాల్ బెల్ట్‌లో పార్టీకి, తనకు నమ్మకమైన వ్యక్తులకు టికెట్లు సాధించుకున్న రావ్ ఇంద్రజీత్ సింగ్ తన కుమార్తె ఆర్తీ రావును కూడా బరిలోకి దింపారు.
గురుగ్రామ్, రోహ్‌తక్, బీవానీ-మహేందర్‌గర్ ప్రాంతాల్లోని మొత్తం 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదింటిలో ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు వచ్చాయి. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. అందులో గురుగ్రామ్, రేవారి, ఫరీదాబాద్, బీవానీ-మహేందర్‌గర్ ప్రాంతంలోనే 28 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. ఇందులో 60 శాతం ఓటర్లు పట్టణ ప్రాంతాల్లో నివసిస్తారు. ఈ 28 స్థానాల్లో బీజేపీ.. 2014లో 15 స్థానాలను దక్కించుకుంది. ఇక 2019కి వచ్చే సరికి మరో స్థానం పెంచుకుని మొత్తం 16స్థానాలను కైవసం చేసుకుంది. అయితే 2014లో 47 సీట్లు సాధించిన బీజేపీ.. 2019లో 40 స్థానాలకు పడిపోయినా అహిర్వాల్ బెల్ట్‌లో మాత్రం 15 నుంచి 16కు పెరగడం గమనార్హం.