కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి కొలువుదీరిన తిరుమలలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం స్వామివారు మాడ వీధుల్లో సూర్యప్రభ వాహనంపై దర్శనం ఇవ్వగా రాత్రి చంద్రప్రభ వాహనంపై దర్బార్ కృష్ణ అలంకారంలో స్వామివారు మాడ వీధుల్లో ఊరేగారు.ఈ సందర్భంగా వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలతో స్వామివారిని కీర్తించగా మంగళవాయిద్యాల నడుమ స్వామివారి వాహనసేవ కోలాహలంగా జరిగింది. వాహన సేవలో టీటీడీ ఈవో జె.శ్యామల రావు దంపతులు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జెఈవోలు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.నిన్న స్వామివారిని 79,753 మంది భక్తులు దర్శించుకోగా 29,623 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల మొక్కుల ద్వారా సమర్పించుకున్న కానుకలతో హుండీకి రూ. 3.48 కోట్లు ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు వెల్లడించారు.