ఈ ఏడాది సాహిత్యంలో నోబెల్ బహుమతికి దక్షిణ కొరియా రచయిత్రి హన్ కాంగ్ ఎంపికయ్యారు. సాహిత్యంలో ఆమె చేసిన విశేష కృషికి గానూ అవార్డుకు ఎంపిక చేసినట్టు నోబెల్ కమిటీ ప్రకటించింది. చారిత్రక విషాదాలను, మానవ జీవితపు దుర్బలత్వాన్ని తన గద్య కవిత్వంతో కాంగ్ కళ్లకు కట్టారని స్వీడిష్ అకాడమీ ప్రశంసించింది. బహుమతి కింద 11 మిలియన్ స్వీడిష్ క్రౌన్లు (1.1 మిలియన్ డాలర్లు) అందజేయనున్నారు. గతేడాది ఏడాది (2023) నార్వేకు చెందిన రచయిత జాన్ ఫోసె (Jon Fosse) సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్నారు.
దక్షిణ కొరియా గ్వాంగ్జూలో ఓ ఉన్నత విద్యా వంతుల కుటుంబంలో 1970లో హన్ కాంగ్ జన్మించారు. ఆమె తండ్రి కూడా ప్రముఖ రచయిత. మొదటిసారి ‘వింటర్ సియోల్’ సహా ఐదు పద్యాలతో 1993లో తొలి రచన చేశారు. ఆ మరుసటి ఏడాది రచయితగా కెరీర్ మొదలుపెట్టిన ఆమె.. రెడ్ యాంకర్ అనే రచనకు 1994లో షిన్మన్ స్ప్రింగ్ సాహిత్య పోటీలో బహుమతి గెలుపొందారు. అలాగే, 1995లో చిన్న కథల సంపుటి యోష్యూను విడుదల చేశారు. అలాగే, కొరియా కళల అకాడమీ సహకారంతో అమెరికాలోని ఐయోవా ఇంటర్నేషనల్ రైటింగ్ ప్రోగ్రామ్‌లో మూడు నెలల పాటు పాల్గొన్నారు.
ఫ్రూట్ ఆఫ్ మై ఉమెన్ (2000), ఫైర్ సాల్మెండర్ (2012) వంటి చిన్న కథల సంపుటిలతో పాటు గ్రీక్ లెసన్స్ (2011), హ్యూమన్ యాక్ట్ (2014), ది వైట్ బుక్ (2016), ఐ డోంట్ నాట్ బిడ్ ఫేర్‌వెల్ (2021) నవలలను రాశారు. సాహిత్యంలో ఆమె సేవలకు గానూ 2016లో ది విజేటేరియన్ రచనకు ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వరించింది. ఇటీవల ఆమెకు మంచి పేరు తీసుకొచ్చిన ఐ డూ నాట్ బిడ్ ఫేర్‌వెల్ 2023లో ఫ్రాన్స్ సాహిత్య పురస్కారం మెడిసిస్ ప్రైజ్, 2024లో ఎమిలీ గుయ్‌మెట్ బహుమతి అందుకుంది.
హాన్ కాంగ్ రచనల్లో పాత్రలు మానసిక, శారీరక సంఘర్షణలను వ్యక్తం చేసేవిగా ఉంటాయని నోబెల్ కమిటీ తెలిపింది. ఆమె రచనలు చారిత్రక విషాదాలు, మానవ జీవితంలోని దుర్బలత్వాన్ని బహిర్గతం చేస్తాయి. శరీరం, ఆత్మ, జీవించి ఉన్నవారు, చనిపోయిన వారి మధ్య సంబంధాల గురించి ఆమెకు ప్రత్యేకమైన అవగాహన ఉంది. ఆమె కవితా, ప్రయోగాత్మక శైలిలో సమకాలీన గద్యంలో ఆవిష్కర్తగా మారిందని నోబెల్ బహుమతి కమిటీ వ్యాఖ్యానించింది. ఇకా, ఏటా నోబెల్ బహుమతులను అక్టోబరు మొదటి వారంలో ప్రకటిస్తారు. వైద్య, భౌతిక, రసాయన, అర్ధ శాస్త్రం, సాహిత్యం, శాంతి ఇలా ఆరు రంగాల్లో ఈ బహుమతులను అందజేస్తారు.