పారిశ్రామిక రంగంతో పాటు సామాజిక సేవా రంగంలో తనదైన ముద్ర వేసిన టాటా గ్రూప్స్ గౌరవ ఛైర్మన్ రతన్ టాటా మృతిపై రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ సంతాపం వ్యక్తం చేశారు. భారత పారిశ్రామిక రంగానికి దశ దిశ చూపించి నవతరం పారిశ్రామిక వేత్తలకు ఆదర్శప్రాయులైన గొప్ప వ్యక్తి రతన్ టాటా అని వెల్లడించారు. పారిశ్రామిక రంగానికి మానవత్వం జోడించి పేద ప్రజల సంక్షేమాన్ని ఆలోచించిన మానవతావాది రతన్ టాటా అని కీర్తించారు. దేశమే ముందు అనే సిద్ధాంతాన్ని ఆజన్మాంతం ఆచరించిన మహనీయులు రతన్ టాటా అని అన్నారు. దాతృత్వంలో రతన్ టాటాకు ఎవరూ సాటిరారని.. కరోనా సంక్షోభ సమయంలో ఆయన వ్యవహరించిన విధానం, అత్యవసరంగా స్పందించిన తీరు, ఖర్చు చేసిన సొమ్ము వెలకట్టలేనిదన్నారు. రతన్ టాటా మరణం దేశానికి, పారిశ్రామిక రంగానికి తీరని లోటుగా వర్ణించారు.
రతన్ టాటా పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మంత్రి కందుల దుర్గేష్ ప్రార్థించారు. దేశ నిర్మాణంలో కీలక భాగస్వామి రతన్ టాటాకు గౌరవ సూచకంగా ఏపీ కేబినెట్ నివాళులు అర్పించిందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఉప్పు నుంచి ఉక్కు దాకా ఆయన పరిశ్రమలు స్థాపించి లక్షలాది మందికి ఉపాధి కల్పించారన్నారు. ఏపీ ప్రజలతోనూ ఆయనకు మంచి అనుబంధం ఉందన్నారు. సామాజిక బాధ్యతగా టాటా సంస్థలు ఏపీ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నాయన్నారు. రతన్ టాటా మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ కేబినెట్‌ను వాయిదా వేశామని మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు.