వైసీపీ పాలనలో పంచాయతీలకు పైసా విదల్చకపోగా.. కేంద్రం నుంచి వచ్చిన నిధులను సైతం పక్కదారి పట్టించడంతో పల్లెల ప్రగతి మరుగున పడిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితిలో మార్పు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి వెలుగులు నింపేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టేలా పల్లెపండుగ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
పండుగ వాతావరణంలో శంకుస్థాపనలు చేసి, 2025 ఏడాది జనవరి నాటికి పనులు పూర్తిచేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామాల్లో పల్లెపండుగ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై గురు, శుక్రవారాల్లో డీపీవో లక్ష్మి సెట్ కాన్ఫరెన్స్ ద్వారా పంచాయతీ కార్యదర్శులు, ఈవోపీఆర్డీలకు మార్గదర్శకాలు జారీచేశారు. రూ.71.2 కోట్లతో 584 పనులు చేపడుతున్నామని డ్వామా పీడీ రవికుమార్ తెలిపారు.