"జయ జయహే మహిషాసుర మర్దిని రమ్యక పర్దిని శైలసుతే అంటూ ఆ పరమేశ్వరిని హైందవులంతా కొలిచే నవరాత్రులు ముగింపుగా ప్రవేశిస్తున్న విజయ దశమి పర్వదినం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అని జనసేన అధినేత పవన్ కల్యాణ తెలిపారు. భారతదేశం నలుమూలలా భక్తులు విశేష భక్తిశ్రద్ధలతో జరుపుకునే ఈ శరన్నవరాత్రులను ఒక ప్రత్యేక ఆధ్యాత్మిక వేడుకగా చెప్పుకోవచ్చు. ఊరు, వాడలంతా అమ్మవారి సంబరాలతో భక్తి భావం ఉట్టిపడుతోంది.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్ని అంటగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ ఆలయం కిక్కిరిసి భక్తులతో అలరారుతోంది. ఈ నవరాత్రులలో దుర్గమ్మను దర్శించుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ విజయదశమి ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని, తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా విరాజిల్లాలని శక్తి స్వరూపిణిని ప్రార్థిస్తున్నాను" అని ట్వీట్ చేసారు.