విజయదశమి రోజున కృష్ణా నదిలో నిర్వహించే తెప్పోత్సవంలో నదీ విహారానికి ఈ ఏడాది బ్రేక్ పడింది. దీనికి కారణం నదిలోకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా ఉండడమే కారణం. విజయదశమి రోజు సాయంత్రం శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు దుర్గాఘాట్ వద్ద పూజలు చేసిన తర్వాత నదిలో హంస వాహనంపై విహరింపజేస్తారు. జలవనరుల శాఖ నిబంధనల ప్రకారం ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నదిలోకి ఇన్‌ఫ్లో కేవలం 10 వేల క్యూసెక్కులు ఉంటేనే విహారానికి అనుమతి ఇస్తారు. కానీ, ప్రస్తుతం ఎగువ నుంచి 41,464 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది.
బ్యారేజ్ 55 గేట్లను ఒక అడుగు మేరకు ఎత్తి 50,949 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో హంస వాహనం విహారానికి అనుమతి ఇవ్వలేమని, నీరు తగ్గే అవకాశం కూడా కనిపించడంలేదని జలవనరుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఆలయ ఈవో రామారావు వైదిక కమిటీ ప్రతినిధులతో సమావేశమయ్యారు. నదీ విహారానికి అనుమతి లేనందున ఉత్సవమూర్తులను దుర్గాఘాట్ వరకు తీసుకెళ్లి హంస వాహనంపై శాస్ర్తోక్తంగా పూజలు నిర్వహించాలని నిర్ణయించారు. వర్షం వచ్చి ఆటంకాల ఎదురైతే మాత్రం మహామండపంలోని ఆరో అంతస్తులో పూజలు నిర్వహిస్తారు.