వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో తెలుగు దేశం పార్టీ కార్యాలయంపై, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు మరో మలుపు తిరిగాయి. ఈ కేసుల్ని సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ అయ్యాయి. ప్రస్తుతం మంగళగిరి, తాడేపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో ఈ కేసుల దర్యాప్తు జరుగుతుండగా.. తాజాగా వీటిని సీఐడీకి బదిలీ చేశారు. ఈ కేసుల విచారణ ఫైళ్లను సోమవారం సీఐడీకి మంగళగిరి డీఎస్పీ అందజేయనున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు కేసుల విచారణ వేగవంతం కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై 2021 అక్టోబరు 19న దాడి జరిగింది. కొందరు దుండగులు రాడ్లు, కర్రలు, రాళ్లతో దాడికి తెగబడ్డారు.. కార్యాలయంలో సామాన్లను ధ్వంసం చేశారు. అప్పట్లోనే వీరంతా వైఎస్సార్‌సీపీకి చెందిన సానుభూతిపరులనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనలో టీడీపీ నేత దొరబాబుతో పాటు ముగ్గురు కార్యాలయ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మంగళగిరిలో డీజీపీ కార్యాలయానికి దగ్గరలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనపై గత ప్రభుత్వ హయాంలో కేసు నమోదు చేసినా విచారణ ముందుకు సాగలేదు. కొంతమందికి 41ఏ కింద నోటీసులు ఇచ్చి ఆ తర్వాత పట్టించుకోలేదనే విమర్శలు వచ్చాయి.
టీడీపీ కార్యాలయంపై దాడికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కారులోనే వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి.ఈ దాడికి పాల్పడ్డవారిలో అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు పానుగుంట చైతన్య, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్‌ఛార్జి దేవినేని అవినాష్ అనుచరులు ఉన్నారని టీడీపీ ఆరోపించింది. అలాగే మాజీ ఎంపీ నందిగం సురేష్ పేరు కూడా వచ్చింది. అయితే ఇటీవల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి రావడంతో ఈ కేసు దర్యాప్తును మళ్లీ ప్రారంభించారు. ఈ కేసులో పలువురు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేయగా.. మాజీ ఎంపీ నందిగం సురేష్ అరెస్ట్ కాగా హైకోర్టు బెయిల్ ఇచ్చింది. అలాగే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురాం, సజ్జల రామకృష్ణారెడ్డి సహా పలువురు పేర్లు కూడా తెరపైకి వచ్చింది.
అంతేకాదు గత ప్రభుత్వ హయాంలో ఉండవల్లిలో చంద్రబాబు నివాసంపై దాడి ఘటన గురించి తెలిసిందే. ఈ కేసు కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. పోలీసులు మళ్లీ దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటూ పలువురికి నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణకు పిలిచారు. ఈ రెండు కేసుల్లో విచారణ కొనసాగుతున్న సమయంలోనే సీఐడీకి అప్పగించడం చర్చనీయాంశమైంది. ఈ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సీఐడికి అప్పగించినట్లు తెలుస్తోంది.