కెనడాలోని పలు బీచ్ లలో ఇటీవల తరచుగా ఓ వింత పదార్థం కొట్టుకొస్తుండడం అంతుపట్టని వ్యవహారంలా మారింది. సరిగా ఉడకని పిండి ముద్దలా కనిపిస్తున్న ఈ పదార్థం ఏంటన్నది ఇంతవరకు గుర్తించలేకపోయారు. తాజాగా, ఇలాంటి మిస్టరీ పదార్థాన్ని న్యూఫౌండ్ లాండ్ సముద్ర తీరాల్లో గుర్తించారు. ఇది వంట నూనె వాసన వస్తోందని ఓ స్థానికుడు తెలిపారు. బీచ్ లలో ఇలాంటి అసాధారణ పదార్థాలు కనిపిస్తున్నాయన్న మాట గత సెప్టెంబరు నుంచి వినిపిస్తోంది. ఈ పదార్థం మూలాలు ఏంటన్నది తెలుసుకునేందుకు స్థానిక అధికార వర్గాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఇది చమురు ఉత్పత్తులకు చెందిన పదార్థం అనే వాదనలను కెనడా పర్యావరణం, వాతావరణ మార్పుల సంస్థ కొట్టివేసింది. అంతేకాదు, ఇందులో ఎలాంటి జీవ సంబంధ కణజాలం కానీ, సముద్ర స్పంజికల ఆనవాళ్లు కానీ లేవని కెనడాకు చెందిన ఓ సముద్ర శాస్త్ర నిపుణుడు తేల్చి చెప్పారు.